కన్నడ నటుడు దర్శన్ జీవితం అనుకోకుండా సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అభిమాని హత్యకేసులో జైలుగోడలమధ్య మగ్గాల్సి వచ్చింది. కన్నకొడుకులాంటి దర్శన్‌కి ఇలా జరగడం తల్లికాని తల్లి సుమలతను ఎంతో కలచివేసింది. నటుడు దర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ అన్‌ఫాలో చేశాడు. తల్లిలా చూసుకున్న సుమలతను కూడా అతను ఈ లిస్ట్‌లో చేర్చడంతో వాళ్లిద్దరి మధ్యా అసలేం జరిగిందన్న అనుమానాలు మొదలయ్యాయి.
కొడుకు తనను అన్‌ఫాలో చేసినా అంతనెంతో ఆవేదనతో ఉన్నాడని అందుకే అలా చేసాడని సుమలత అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్, సుమలతల బంధం చెడిపోయిందని కన్నడ మీడియా అంటోంది. జైల్లో దర్శన్‌ను కలిసి పరామర్శించపోవడమే ఇద్దరి మధ్యా విభేదాలకు కారణమా అన్న అనుమానాలొస్తున్నాయి.
దీంతో ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు సుమలత. తన ఆఖరి శ్వాస వరకు దర్శన్ తన కొడుకేనన్నారు. నన్నొక్కదాన్నే కాదు దర్శన్ అందరినీ అన్‌ఫాలో చేశాడని గుర్తుచేశారామె. సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మానేస్తే.. రిలేషన్ షిప్ పాడవుతుందా అన్నది సుమలత క్వశ్చన్. ఇది విని నవ్వాలో, బాధపడాలో తెలీడం లేదన్నారు సుమలత.
దర్శన్ ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు సుమలత. నొప్పిలేకుండా ఎదగడం, మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వారితో సంభాషించడం, చింతలు లేకుండా వర్తమానంలో ప్రశాంతంగా జీవించడం చాలా ముఖ్యం అంటూ పోస్ట్ చేశారు సుమలత అంబరీష్.
ఇటీవల దర్శన్ పుట్టినరోజు సందర్భంగా సుమలత అతనికి విషెస్ చెబుతూ సాధన శిఖరాన్ని చేరే శక్తి నీలో ఉంది అని ట్వీట్ చేశారు. అయితే దర్శన్ ఫ్యాన్స్ కొందరు దీనిపై ఫేక్ మదర్ ఇండియా, ఊసరవల్లి అమ్మ అంటూ విమర్శలు గుప్పించారు.
అయితే తానెవరినీ టార్గెట్ చేసి పోస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు సుమలత. తన పోస్ట్‌కి దర్శన్‌కి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన జీవితంలో ప్రతికూల ఆలోచనలకు తావు లేదన్నారు సుమలత.