పైరసీ అనేది సినీ పరిశ్రమకు పెనుభూతంలా పట్టుకుంది. సినిమాని చంపేస్తోంది. తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘తండేల్‌’ (Thandel)కు ఈ పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పైరసీ దీన్ని వేధిస్తోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించి షాక్ ఇచ్చారు. ఈ విషయమై నిర్మాత బన్నివాసు స్పందించారు. సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఓ మీడియా సంస్థలో వచ్చిన వార్త ద్వారా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో తండేల్‌ను ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇది చట్ట విరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమే. ఒక సినిమా ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతల కల’’ అని పేర్కొన్నారు.

దీనికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు (Bunny Vas) కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

అలాగే ఇటీవల ఓ లోకల్‌ ఛానల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీని గురించి నిర్మాత బన్నివాసు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ… ‘‘సినిమా పైరసీ వస్తుంది.. చూసేద్దామని చాలామంది అనుకుంటుంటారు. మా ‘గీత గోవిందం’ సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్‌’ సినిమాలను పైరసీ చేసినవారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.

, , , , ,
You may also like
Latest Posts from