సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన ఫిష్ వెంకట్ (వాస్తవ నామం మంగిలపల్లి వెంకటేష్) ఇకలేరు. వయసు 53. గత కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయకపోవడంతో డయాలసిస్‌కు దిగిన కుటుంబం, మార్పిడి కోసం దాతల కోసం వేచి చూస్తుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.
వెంకట్ నుంచి ‘ఫిష్’ వెంకట్ దాకా…
మచిలీపట్నం వాసిగా సాదాసీదా చేపల వ్యాపారం చేసుకుంటూ జీవితం సాగిస్తున్న వెంకట్‌కి 1989లో ఓ మిత్రుడు ద్వారా సినీ నిర్మాత మాగంటి గోపినాథ్ పరిచయం కావడం జీవితాన్నే మార్చేసింది. 1991లో వచ్చిన జంతర్ మంతర్ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టినా, గుర్తింపు మాత్రం దక్కలేదు. అప్పట్లో “ఫిష్ వెంకటేశ్” అనే పేరుతో పిలిచే వారు. నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత “ఫిష్ వెంకట్”గా పేరు మారిపోయింది.
2002 ‘ఆది’ సినిమా – జర్నీ ప్రారంభం
వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘ఆది’ సినిమాలో ఫిష్ వెంకట్‌కి వచ్చిన పాత్రే అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. “ఆది తర్వాతనే నా సినిమా జీవితం మొదలైంది” అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలే ఆయన ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబించాయి. దర్శకుడు వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అని పేర్కొన్న వెంకట్, దివంగత నటుడు శ్రీహరితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
వంద సినిమాల వెనక నవ్వులతో పాటు బాధల కథ కూడా
‘ఆది’, ‘దిల్’, ‘బన్నీ’, ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్‌సింగ్’, ‘డీజే టిల్లు’, ‘మిరపకాయ్’, ‘కింగ్’, ‘దరువు’, ‘సుప్రీమ్’ వంటి హిట్ చిత్రాల్లో పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన ఫిష్ వెంకట్, సొంతంగా ఓ కామెడీ ట్రాక్ క్రియేట్ చేసుకున్న నటుడు. ఆయన చివరి సినిమా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’.
ఆర్థికంగా దెబ్బ తిన్న ఓ నటుడి కథ…
వెంకట్ కుమార్తె ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “వైద్యానికి అవసరమైన ఖర్చులు మించే పరిస్థితుల్లో ఉన్నాం… దాతల సాయం కావాలి” అని వేడుకుంది. కానీ ఆ సహాయం రాకముందే ఆయన కన్నుమూయడం ఎంతో విచారకరం. సినీ ఇండస్ట్రీలో అనేక మందిని నవ్వించిన నటుడికి చివరికి అవసరమైన మద్దతు దక్కకపోవడం ఆవేదన కలిగించే విషయం.
రాంనగర్‌లో నివసిస్తున్న ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకోవటానికి సినీ సంఘాలు, శ్రేయోభిలాషులు ముందుకు రావాలని పలువురు పిలుపు ఇస్తున్నారు. వెంకట్ జ్ఞాపకాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో నవ్వులు, కొన్ని కళ్ల తడులు.
వీడ్కోలు ఫిష్ వెంకట్ … మీ కామెడీకి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు చిరునవ్వుతో స్పందిస్తూనే ఉంటారు.