పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న విడుదలై మంచి స్పందనను పొందింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయడం జరిగింది. కానీ, షూటింగ్ మద్యలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో చివరికి దర్శకుడిగా జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు.

ఈ సినిమా గత ఐదేళ్లుగా అనేక అడ్డంకులు, వాయిదాలతో ముందుకు సాగుతూ చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా, క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ – “నేను ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు వదిలేశాను అన్న అసలు విషయం త్వరలో అందరికీ తెలుస్తుంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే, తనకు పవన్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా చెప్పారు. “మా మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. భవిష్యత్తులో పవన్ గారితో మళ్లీ పని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. తన వైపు నుంచి ఎలాంటి సమస్య లేదన్న సంకేతాలు ఇచ్చారు.

గమనించదగిన విషయం ఏంటంటే… సినిమా విడుదలకు ముందు కూడా క్రిష్‌ పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించారు. “ఈ సినిమా పూర్తి కావడంలో పవన్ గారి కమిట్‌మెంట్, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారి సహనం ఎంతో కీలకం” అని పేర్కొంటూ ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్‌) లో పోస్ట్ చేశారు.

ఇక ప్రమోషన్‌ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా క్రిష్‌పై హృదయపూర్వకంగా మాట్లాడారు. “కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల వద్దకు ఎలా చేరింది… దాని చరిత్రపై ఒక విభిన్న దృక్కోణం తీసుకొచ్చిన స్క్రిప్ట్ ఇది. క్రిష్ వచ్చినపుడే నాకు ఇది సాధారణ కథ కాదని తెలిసింది” అంటూ ప్రశంసలు కురిపించారు.

అన్నింటిని బట్టి చూస్తే… హరిహర వీరమల్లు సెట్స్‌పై ఏమేం జరిగినా, వ్యక్తిగతంగా మాత్రం పవన్-క్రిష్ మధ్య పాజిటివ్ రిలేషన్ కొనసాగినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు క్రిష్ ‘త్వరలో అసలు విషయాలు వెల్లడిస్తాను’ అని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంకా ఆసక్తికరంగా మారింది.

, , , , , ,
You may also like
Latest Posts from