సీనియర్ నటి, టీవీ నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధికను జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైద్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం… రాధికకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు ఇప్పటికీ చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
రాధిక వెంటనే కోలుకోవాలని అభిమానులు, సినీ సహచరులు సోషల్ మీడియాలో ప్రేయర్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో శ్రేష్ఠమైన పాత్రలతో ఆమె తనదైన ముద్ర వేసుకుంది. చిరంజీవితో కలిసి 15కి పైగా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. నటిగానే కాకుండా, టీవీ సీరియల్స్ నిర్మాతగానూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లోనూ తన స్థానం కోసం ప్రయత్నాలు చేశారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధిక త్వరగా కోలుకొని మళ్లీ బిజీగా కనిపించాలని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.