‘ఏమైనా చేస్తా సర్… అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్…’ అంటూ వచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom)డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ దేవరకొండ హీరోగా ఆయన 12వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే పేరు ఖరారైంది. పేరుతో కూడిన టీజర్‌ని బుధవారం విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఓవర్ సీస్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు ఎంక్వైరీలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నార్త్ అమిరికా డీల్ $2.1 మిలియన్ తో క్లోజ్ అయ్యింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇదే ఇది పెద్ద ఓవర్ సీస్ డీల్.
స్టార్ హీరో ఎన్టీఆర్ చెప్పిన మాటలతో ఈ టీజర్ మొదలవుతుంది. ‘అలసట లేని భీకర యుద్ధం… అలలుగా పారే ఏరుల రక్తం… వలస పోయినా అలసిపోయినా.. ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు.. మట్టికింద మృతదేహాలు… ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలీ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజుకోసం… కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం…’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన శక్తిమంతమైన సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా సాగుతుంది.
చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన సంభాషణలు, ఆయన లుక్ చిత్రానికి అంతే ఆకర్షణగా నిలిచాయి. హిందీ, తమిళంలోనూ విడుదలైన టీజర్‌కి రణ్‌బీర్‌కపూర్, సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. వేసవి సందర్భంగా మే 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు టీజర్‌తోపాటు ప్రకటించాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జోమోన్ టి.జాన్, గిరీష్ గంగాధరన్, కూర్పు: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్లా, సంగీతం: అనిరుధ్ రవిచందర్.