బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇంటిని ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించారంటే… అది పెద్ద వార్తే! బస్సులు, వ్యాన్లతో పోలీసులు బాంద్రాలోని ఆయన నివాసానికి చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ పరిశ్రమతో పాటు నెటిజన్లు కూడా షాక్‌కు గురయ్యారు. “ఏం జరిగిందీ?”, “ఏదైనా కేసా?”, “రెయిడ్‌లా ఉందే!” అంటూ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తపై ఇక ఓ క్లారిటీ వచ్చింది. ఆమిర్ ఖాన్ టీమ్‌లోని ఓ సభ్యుడు స్పందిస్తూ, ఇది అంత సీరియస్ విషయం కాదని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్న ఐపీఎస్ అభ్యర్థులు ఆమిర్‌ను కలవాలనుకున్నారు. అందుకే వారు ముందుగా అనుమతి తీసుకొని ఆయన నివాసానికి వచ్చారని చెప్పారు. అంతే కాదు, ఆమిర్ స్వయంగా వారిని తన ఇంటికి ఆహ్వానించి, అద్భుతంగా అతిథ్యం ఇచ్చారని వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు అంటున్నారు. 1999లో విడుదలైన సర్ఫ్‌రోష్ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఒక పోలీస్ అధికారిగా నటించారు. ఆ సినిమాలోని పాత్రకు బోలెడంత క్రేజ్ వచ్చింది. ఆమేరకు నిజ జీవిత పోలీస్ అధికారులు కూడా అతనికి అభిమానులయ్యారని, అప్పటినుంచి ఎప్పుడైతే అవకాశం వస్తే ఐపీఎస్ ట్రైనీలను ఆమిర్ ఆహ్వానిస్తూ వస్తున్నారని టీమ్ సభ్యుడు వివరించారు. దీంతో రెండు రోజులుగా వైరల్ అవుతున్న చర్చలకు చెక్ పడింది.
ఇదిలా ఉండగా… ఆమిర్ ఖాన్ త్వరలో మెల్‌బోర్న్‌లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకు జరిగే ఈ ఉత్సవంలో ఆయన తాజా సినిమా సితారే జమీన్ పర్ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ప్రేక్షకులను కూడా చక్కగా ఆకట్టుకుంటోంది.
మొత్తానికి… “పోలీసుల దాడి” అనుకున్నది, నిజానికి “ఆతిథ్య ఆహ్వానం” అని తేలిపోయింది!