సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఏడాదికి ఒకటైనా చూడకపోతే చాలామందికి ఏదో వెలితిగా ఉంటుంది. అంతలా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. దేశ,విదేశాల్లో ఉండే అభిమానులు ఎప్పుడూ ఆయన వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపెడుతూంటారు. ఈ క్రమంలో రోజూ ఆయనపై రకరకాల వార్తలు వస్తూంటాయి. అలాగే పుస్తకాలు సైతం వచ్చాయి.
రజనీకాంత్ బయోపిక్ సినిమా గా మాత్రం రాలేదు. కానీ నిజంగా రజనీ బయోపిక్ చేస్తే చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఆ బయోపిక్ తీయటానికి ఆయన ఆమోదముద్ర వేయాలి. అదే సమయంలో అది తీయగల సత్తా ఉన్న డైరక్టర్ కావాలి. అయితే దర్శకుడు శంకర్ ..తనకి రజనీ బయోపిక్ తీయటం ఆసక్తి అని తేల్చారు.
బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు రజనీకాంత్ అందుకోని గౌరవం లేదు.. చూడని సత్కారం లేదు. అవార్డుల ఆయనకు దాసోహమయ్యాయి. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శివాజి రావ్ గైక్వాడ్ అలియస్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు.
నటనకు అందంతో పనిలేదని, తన స్టైల్, మేనరిజంతో ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చని నిరూపించిన హీరో రజినీకాంత్. కష్టపడితే ఎలాంటి విజయాలనైనా అందుకోవచ్చని యువతకు స్ఫూర్తి నింపారు. తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు.
డైరక్టర్ శంకర్ సినిమాలంటే భారీతనానికి, సామాజిక సందేశాలకు పెట్టింది పేరు. 90దశకంలోనే దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ బయోపిక్ ప్రస్తావన వచ్చింది.
భవిష్యత్తులో బయోపిక్ సినిమా తీయాల్సివస్తే తాను రజనీకాంత్ జీవిత చరిత్రను వెండితెర దృశ్యమానం చేస్తానని ఆయన చెప్పారు. ‘నాకు ప్రస్తుతానికైతే బయోపిక్ తీయాలనే ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే రజనీకాంత్ జీవిత చరిత్రనే తీస్తాను. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం’ అని శంకర్ తెలిపారు.