
ఢిల్లీ హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం?
డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పేర్లు, ముఖచిత్రాలు, గుర్తింపులు ఎంత సులభంగా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో తన పేరును, వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు కోర్ట్ కు వెళ్లి కీలక విజయం సాధించారు జూ. ఎన్టీఆర్. ఆయన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ డిల్లీ హై కోర్ట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 22, 2025న జస్టిస్ మన్‌మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా కీలక తీర్పు ఇచ్చారు. జాన్ డో ఆర్డర్‌తో పాటు ఎక్స్‌పార్టే అడ్-ఇంటిరిమ్ ఇంజంక్షన్ మంజూరు చేస్తూ, ఎవరైనా సరే నెట్లో కానీ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కానీ, తృతీయ పక్ష మర్చండైజ్ రూపంలో కానీ ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, ఐడెంటిటీ, పర్సనాలిటీని అనుమతి లేకుండా వాణిజ్యంగా ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులు, ఆన్‌లైన్ విక్రేతలు, ఇతర మధ్యవర్తులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పుతో సెలబ్రిటీల పర్సనాలిటీ మరియు పబ్లిసిటీ రైట్స్ ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ మార్కెట్ విస్తరిస్తున్న ఈ కాలంలో, పేరును బ్రాండ్‌గా మార్చి దుర్వినియోగం చేయడంపై కోర్టు కఠినంగా స్పందించడం విశేషంగా మారింది.
ఈ తీర్పుపై స్పందించిన ఎన్టీఆర్, న్యాయవ్యవస్థకు మరియు తన లీగల్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డిజిటల్ యుగంలో తన వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణ ఉత్తర్వులు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కేసులో తనకు అండగా నిలిచిన న్యాయవాదులు, లీగల్ టీమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
”నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఢిల్లీ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్ లకు.. రాజేందర్, రైట్స్ & మార్క్స్ బృందం వారి లీగల్ సపోర్టుకు నా కృతజ్ఞతలు. మీ స్థిరమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనికి #Justice #PersonalityRights #DigitalAge అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు.
మొత్తంగా చూస్తే, ఇది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇతర సెలబ్రిటీలకు కూడా దారి చూపే కీలక న్యాయ ఉదాహరణగా మారింది. పేరు, గుర్తింపు అనేవి వ్యక్తిగత ఆస్తులే అని, వాటిని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఈ తీర్పు బలంగా చాటింది.
