జర్నలిస్టుపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తండ్రి కొడుకుల (Mohan babu – Manchu Manoj) గొడవలో జర్నలిస్టులపై మోహన్ బాబు (Mohan babu) దాడి చేయగా ఆయనపై కేసు నమోదయింది. ఈ మేరకు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా .. హైకోర్టు ఈయన పిటిషన్ కొట్టి వేసింది. ఆ తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని కాదని మోహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా .. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు భారీ ఊరట కలిగించింది.
గాయపడిన జర్నలిస్టుని ఆస్పత్రికి వెళ్లి మోహన్‌బాబు పరామర్శించారని విచారణ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విలేకరికి అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్టు కోర్టుకు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి, ఇంటికి వచ్చిన వారిపై దాడి చేశారని.. విచారణకు కూడా వెళ్లలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా వ్యవహరించలేదని న్యాయవాది తెలిపారు.
‘‘ఇది పూర్తిగా ఇక కుటుంబానికి సంబంధించిన విషయం. వారికి రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తుల వ్యవహారం. కుమారుడు, తండ్రికి మధ్య ఉన్న కుటుంబ వివాదం తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేదు. ఒక యూనివర్సిటీ, విద్యా సంస్థలకు సంబంధించి తప్ప మరేమీ లేదు’’ అని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
గాయపడిన జర్నలిస్టు ఎలా ఉన్నారని ధర్మాసనం అడిగింది. విలేకరి తరఫు న్యాయవాది పరిస్థితిని వివరించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.