ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1937లో జన్మించిన హరికృష్ణ గోస్వామి (మనోజ్‌ కుమార్) 1957లో ‘ఫ్యాషన్‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘కాంచ్‌ కీ గుడియా’ అనే సినిమాలో నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా, రైటర్‌గా, నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎక్కువగా దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో ఆయన పేరు ‘భరత్‌కుమార్‌’గా మారిపోయింది.

మనోజ్ కుమార్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ వార్త తననెంతో బాధించిందన్నారు.

‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ఐకాన్‌. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన రచనల్లోనూ జాతీయభావం ఉప్పొంగుతుంటుంది. అవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని ఎక్స్‌ వేదికగా మోదీ సంతాపం తెలిపారు.

మనోజ్ కుమార్ 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు. ఆయన(Manoj kumar) తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా మనోజ్‌ తెరకెక్కించిన ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రం 1974లోనే అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. మనోజ్‌ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

You may also like
Latest Posts from