మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. ఆయన చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీసుల టీమ్ అక్కడ రైడ్ చేసింది. ఈ టీమ్ హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే నటుడు పారిపోయారు.
మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడినుంచి మెట్ల మార్గం గూండా పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
మరోవైపు సినిమా సెట్లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజాగా విన్సీ సోనీ అలోషియస్ (Vincy Aloshious), షైన్ టామ్ చాకోపై ఫిర్యాదు చేశారు.
కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘సూత్రవాక్యం’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా నటి ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.