సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat), నికితా దత్తా (Nikita Dutta), కునాల్ కపూర్ ప్రధాన పాత్రల్లో .. కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ సంయుక్తంగా తెరకెక్కించిన సినిమా ‘జ్యువెల్ థీఫ్’. నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో మూడు వారాల క్రితం విడుదలైన ఈ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాని పూర్తిగా చూడలేకపోయామని చాలా మంది తేల్చారు. సోషల్ మీడియాలోనూ నెగిటివ్ బజ్ వచ్చింది. చెత్త సినిమా అని డైరక్ట్ గానే తేల్చేసింది నేషనల్ మీడియా సైతం. అయితేనేం సినిమా వ్యూస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు వస్తున్నాయి.
ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమాకు మొదటి వారంలో 7.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండో వారంలో 8.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే రెండు వారాల్లో 16.1 మిలియన్ వ్యూస్, అంటే 1.61 కోట్ల వ్యూస్. ఈ విజయం సినిమాను ఇంకా ఎక్కువ మంది చూడటానికి దోహదపడుతుంది.
సినిమా కథేంటి
రెహాన్ రాయ్ (సైఫ్ అలీఖాన్) విలువైన వజ్రాలు చోరీ చేస్తూ ప్రపంచ దేశాలు తిరుగుతుంటాడు. అలా బుడాపెస్ట్‌లో ఉన్న అతడిని సోదరుడు కలుస్తాడు. ఓ విషయంలో తండ్రి మోసపోయిన విషయం చెబుతాడు. ఆర్ట్ కలెక్టర్ ముసుగులో ఉన్న క్రిమినల్ రంజన్ (జైదీప్ అహ్లావత్) చెప్పిన డీల్‌ను ఓకే చేస్తేనే.. తండ్రి ఆ సమస్య నుంచి బయటపడతాడని విజ్ఞప్తి చేస్తాడు.
ఆ డీల్.. అత్యంత విలువైన వజ్రం రెడ్‌సన్‌ను రాబరీ చేయడం. మరి, ముంబయిలోని ఓ మ్యూజియంలో భారీ భద్రత నడుమ ప్రదర్శించిన రూ.500 కోట్లుకుపైగా విలువైన ఆ డైమండ్‌ను రెహాన్ ఎలా చోరీ చేస్తాడు..? రెహాన్‌ను అరెస్టు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ (కునాల్ కపూర్) అతడిని పట్టుకున్నాడా?
రంజన్ ఏ విషయంలో రెహాన్ తండ్రిని మోసం చేశాడు? ఎందుకు కన్నతండ్రే అతడిని ఇంటి నుంచి గెంటేశాడు? తదితర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.