ఎప్పుడెప్పుడా అని బాలయ్య (Balakrishna) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘అఖండ 2’ టీజర్ (Akhanda 2 Teaser) వచ్చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా చిత్ర టీమ్ ఆ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. పొడవాటి జుత్తుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?’ అంటూ విలన్‌కి వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ కూడా ఉంది.
టీజర్‌లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టారని, ఆయన లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు కాగా.. 14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘అఖండ’ నుంచి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన బాలయ్య.. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్నారు.
బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్ ఇది. సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది.