హీరో రామ్ గత కొంతకాలంగా వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. అలాంటి టైమ్‌లోనే ఆయన “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌పై భారీ గ్యాంబిల్ చేస్తున్నాడు.
ఈ మూవీకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేం పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా… రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఉపేంద్ర… ‘సూర్యకుమార్’ రోల్‌లో సినీ హీరోగా కనిపించనుండగా… ఆయనకు బిగ్ ఫ్యాన్‌గా సాగర్ రోల్‌లో రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. హీరోకు, ఫ్యాన్‌కు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఓ అందమైన లవ్ స్టోరీని కూడా చూపించనున్నారు.
బజ్ బాగుంది కానీ…
టీజర్, ఫస్ట్ సింగిల్‌కి యూత్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రామ్ కెరీర్‌ను మళ్లీ బూస్ట్ చేసే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు.
రిలీజ్ డేట్ రిస్కీ ప్లాన్
ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అనౌన్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ‘స్టార్స్ ఫ్యాన్స్ అందరూ సమావేశం అయ్యారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని సినిమాలో చూసుకున్నారా? ఈ ఏడాది మీ జీవితాన్ని బిగ్ స్క్రీన్‌పై తిరిగి చూడడానికి రెడీగా ఉండండి. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.’ అంటూ రాసుకొచ్చారు.
మేకర్స్ నవంబర్ 28న రిలీజ్‌గా లాక్ చేయటమే డిస్కషన్ పాయింట్ గా మారింది. ఆ వారం ఎలాంటి సెలవులు లేవు. దాంతో పాటు, వారం గ్యాప్‌లోనే భారీ క్రేజ్ ఉన్న “రాజా సాబ్” వస్తోంది.
అదీ కాకపోతే, అదే స్లాట్‌లో “అఖండ 2” అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.
బాక్స్ ఆఫీస్ లెక్కలు
ఒకవైపు ఆఫ్-సీజన్ రిలీజ్, మరోవైపు వారం లోపలే బిగ్గీస్… ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ అద్భుతంగా ఉండాల్సిందే. లేని పక్షంలో, బాక్స్ ఆఫీస్‌లో ప్రెజర్ బాగా పడే అవకాశం ఉంది.
ఇప్పుడు ట్రేడ్ అడుగుతోన్న ప్రశ్న ఒక్కటే… “రామ్… నీకు ఈ బిజినెస్ రిస్క్ అవసరమా?”