
ఫేక్ న్యూస్, ట్రోలింగ్ వల్లే నా తల్లి ప్రాణాలు పోయాయి
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో నెలల తరబడి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫేక్ న్యూస్ ఎదుర్కొన్న నటి హేమా కొల్లా, కన్నీళ్లు పెట్టే వీడియోను విడుదల చేశారు. ఆమెలాగే కుటుంబం కూడా ఈ ఒత్తిడిని భరించలేకపోయిందని, ముఖ్యంగా తన తల్లి దీనికి బలైందని హేమా భావోద్వేగంతో చెబుతున్నారు.
హేమా చెప్పిన విషయాలు ఒక్కటోక్కటిగా షాక్‌కు గురిచేస్తున్నాయి.
హైకోర్టు క్లీన్చిట్… కానీ ఆ సంతోషం నిలవలేదు
“నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు కేసును పూర్తిగా కొట్టివేసింది. నేను వెంటనే చెప్పలేదు, అధికారిక జడ్జ్‌మెంట్ కాపీ కోసం వేచిచూశాను. ఆ సంతోష వార్తను నా అమ్మతో పంచుకున్నా… కానీ నేను ఎదుర్కొన్న అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది,” అని హేమా చెప్పింది.
“నా మీద వచ్చిన అబద్ధాలు నా అమ్మ ప్రాణం తీశాయి” — హేమా ఆవేదన
“ఎన్నిసార్లు నేను తప్పు చేయలేదని చెప్పినా… ఎవరూ వినలేదు. అబద్ధ వార్తలు, ట్రోలింగ్, దూషణ — ఇవన్నీ నా అమ్మ ఆరోగ్యాన్ని నాశనం చేశాయి.
నేడు నేను కేసు గెలిచాను… కానీ నా అమ్మ లేదు.
నా అమ్మను తిరిగి తీసుకురాగలరా?” అని హేమా కన్నీరు పెట్టుకున్నారు.
ఆరోపణల తర్వాత కెరీర్ దెబ్బతింది
డ్రగ్ అలిగేషన్స్ వచ్చిన తర్వాత సినిమాల అవకాశాలు దాదాపు పూర్తిగా ఆగిపోయాయని, ప్రస్తుతం రీల్స్, యూట్యూబ్ వీడియోలు మాత్రమే చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్టు ఆమె వెల్లడించింది.
