కన్నడ బ్లాక్‌బస్టర్ ‘బజరంగి’ సినిమాలో కృష్ణ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, ‘సీతారామం’ వంటి హిట్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రొఫెషనల్ నృత్యకారిణిగా పేరొందిన ఆమె, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె కారు దొంగతనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నటి రుక్మిణి విజయ్ కుమార్‌కు చీకటి అనుభవం ఎదురైంది. 23 లక్షల రూపాయల విలువైన వస్తువులు—వజ్రాల ఉంగరాలు, రోలెక్స్ వాచ్, బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ కారు నుంచే మాయమయ్యాయి! వివరాల్లోకి వెళితే…
మే 11న ఉదయం రుక్మిణి వాకింగ్‌కి వెళ్లిన సమయంలో చిన్నస్వామి మైదానం గేట్ 18 వద్ద తన కారును పార్క్ చేసింది. కాని లాక్ వేయడం మర్చిపోయింది. ఇదే అవకాశంగా చూసిన టాక్సీ డ్రైవర్ మస్తాన్ కారులోకి వెళ్లి, రోలెక్స్ వాచ్ (రూ. 9 లక్షలు), వజ్రపు ఉంగరాలు (రూ. 10 లక్షలు + 3 లక్షలు), బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్ (రూ. 1.5 లక్షలు), డిజైనర్ పర్స్ (రూ. 75,000) లాంటి విలువైన వస్తువులను అపహరించాడు.
రుక్మిణి వెంటనే కప్పన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మొత్తం దొంగిలించబడిన 23 లక్షల విలువైన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.