

నాలుగేళ్ల క్రితం డిసెంబరులో ‘అఖండ’తో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘అఖండ 2: తాండవం’తో రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్ హీరోయిన్. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దీని కోసం ఆ నెల 5వ తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఆధ్యాత్మిక అంశాలతో నిండిన ఈ మాస్ యాక్షన్ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో అలరించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డీల్ ఫైనల్ అయ్యినట్లు సమాచారం. అది కూడా రికార్డ్ స్దాయిలో అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
‘అఖండ 2: తాండవం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూ. 85 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా భారీ రేటుకు ఓటీటీ రైట్స్ తీసుకోడానికి నెఫ్ ఫ్లిక్స్ వెనకాడలేదని అంటున్నారు. బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
‘అఖండ 2’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హైప్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఈ సినిమాకి భారీ ఓటీటీ రేటు పలకడానికి కారణమయ్యాయి.
‘అఖండ 2’ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అఘోరా పాత్ర ప్రధానంగా ఉండబోతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తుండగా.. సి.రామ్‌ప్రసాద్, సంతోశ్ డిటాకే ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.