ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే,బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు.
ప్రథానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టుతో హాజరయ్యారు. సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
బాలయ్య మాట్లాడుతూ…. ‘‘చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. నాకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చింది.
నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్‌గా నిలిచాయి. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా నేను సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం ’’ అని చెప్పారు.
నందమూరి తారకరామారావు (N T Ramarao) కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రి అడుగు జాడల్లో ప్రయాణించి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నారు బాలకృష్ణ (Balakrishna). పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక స్టార్ హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్నారు.
క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మభూషణ్’ (Padma Bhushan for Balakrishna) పురస్కారాన్ని ప్రకటించింది.