వెంకటేష్ , ఆయన కుటుంబసభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే…

బాధితుడు నందకుమార్‌కు చెందిన దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2022లో జిహెచ్‌ఎంసి సిబ్బంది, కొందరు బౌన్సర్లతో కలిసి దక్కన్‌ హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు.

ఈ విషయంలో నందకుమార్‌ కోర్టును ఆశ్రయించగా హోటల్‌కి సంబంధించిన విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని, ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగకూడదని దగ్గుబాటి కుటుంబాన్ని కోర్టు ఆదేశించింది.

అయినప్పటికి దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్ట్ ఆర్డర్స్ లెక్కచెయ్యకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేశారు.

దీంతో మరోసారి తనకి న్యాయం చెయ్యాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు.

ఈ కేసుని విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్కచెయ్యని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చెయ్యాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుని మరింత క్షుణ్ణంగా విచారించాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశించింది.

,
You may also like
Latest Posts from