
‘ధురంధర్’ లో తమన్నా ఓకే అయినా ఎందుకు పక్కన పెట్టారు? దర్శకుడి షాకింగ్ ఆలోచన!
బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతున్నాయి అంటే… అది కేవలం హిట్ కాదు, దర్శకుడి ఆలోచన గెలిచిన సినిమా అని అర్థం. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ కూడా అలాంటి సినిమానే. భారీ ఓపెనింగ్స్, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ఆశ్చర్యమేంటంటే… స్టార్ హీరోయిన్ తమన్నా పేరు ఈ సినిమా నిమిత్తం పరిశీలనలోకి వచ్చినా, కావాలనే ఆమెను పక్కన పెట్టారట! ఒక స్టార్‌ను వదిలేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ‘ధురంధర్’ టీమ్ తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు సినిమా స్థాయిని చెప్పేస్తోంది.
అసలు విషయం ఏంటంటే…
‘ధురంధర్’లో ఎక్కువగా చర్చకు వచ్చిన పాట “శరరత్” . ఈ సాంగ్ మొదటిసారి ప్లే అయినప్పటి నుంచే కథలో భాగంలా ఫీల్ ఇచ్చిందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. కానీ ఈ పాటకు మొదటగా తమన్నా పేరు ప్రపోజ్ చేశారని తాజాగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ వెల్లడించారు. ఆయన మాటల్లోనే – “ఈ పాటకు తమన్నా అయితే బాగుంటుందని నేను సూచించాను. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ అంగీకరించలేదు.”
ఇక్కడే దర్శకుడి ఆలోచన బయటపడింది. ఆదిత్య ధర్ అభిప్రాయం ప్రకారం, తమన్నా లాంటి స్టార్ ఈ పాటలో కనిపిస్తే… ప్రేక్షకుల ఫోకస్ కథ మీద కాకుండా ఆమె డ్యాన్స్, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ మీదకి వెళ్లిపోతుందట. అలా అయితే పాట ఒక కమర్షియల్ ఐటమ్ నెంబర్‌గా మారి, కథ ప్రవాహాన్ని బ్రేక్ చేసే ప్రమాదం ఉంటుందని ఆయన భావించారట.
అందుకే ఈ పాటను “వావ్ ఫ్యాక్టర్” కోసం కాకుండా, కథలో సహజంగా కలిసిపోయేలా డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడట.
ఆ ఆలోచనలో భాగంగానే స్టార్ ఇమేజ్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే యువ నటీమణులు అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా లను ఎంపిక చేశారు. ఫలితం? “శరరత్” పాట సినిమా కథలో ఒక కీలక మూడ్‌గా నిలిచింది.
‘జైలర్’లో “కావాలయ్య” తో తమన్నా సృష్టించిన హవా ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. ఆమె క్రేజ్ ఎంత పెద్దదో చెప్పడానికి అదే చాలు. కానీ ప్రతి సినిమాకు అదే ఫార్ములా అవసరం ఉండదు. ‘ధురంధర్’కి కావాల్సింది స్టార్ పవర్ కాదు… కథ మీద పూర్తి కంట్రోల్. అదే దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకున్న కీలక నిర్ణయం.
ఒక్కోసారి పెద్ద స్టార్‌ను వదిలేయడమే పెద్ద రిస్క్. కానీ ఆ రిస్క్ కథ కోసం తీసుకున్నప్పుడు… అదే సినిమా బలంగా మారుతుంది. ‘ధురంధర్’ బాక్సాఫీస్ హిట్ అవ్వడానికి ఇలాంటి సూక్ష్మమైన, కానీ ధైర్యమైన నిర్ణయాలే కారణమని సినీ వర్గాలు అంటున్నాయి. స్టార్లకంటే కథను ముందు పెట్టినప్పుడు… హిట్ కూడా కథనే ఫాలో అవుతుంది.
