పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరో గా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జులై 24న పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీమ్ స్పెషల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉందని నవ్వుతూ పవన్ తన స్పీచ్‌ను మొదలెట్టారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. దీనికోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఫొటోలు కూడా పేపర్లో వేయలేదు. దీంతో పబ్లిసిటీ లేకుండానే నా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమా గురించి నాకు ఏం మాట్లాడాలో తెలియదు.
ఈ ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం ఏఎం రత్నమే. సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. మన చిత్ర పరిశ్రమని పాన్‌ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి రత్నం. ఈ సినిమా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంది. నేను పాలిటిక్స్‌కు వెళ్లిపోయిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేకపోయాను. అయినప్పటికీ నా బెస్ట్ ఇచ్చాను. గతంలో నేను నేర్చుకున్న మార్షల్‌ఆర్ట్స్ ఈ సినిమాకు ఎంతో పనికి వచ్చింది’’ అని పవన్ వివరించారు.
అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా వచ్చా..
‘‘ఈ సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టు. కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుంది. క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో ముందుకువచ్చారు. ఆయనకు మా టీమ్ అందరి తరఫున కృతజ్ఞతలు. ఒక్కోసారి ఇండస్ట్రీ చాలా కఠినంగా ఉంటుంది. రత్నం ఎంతో ముందుచూపు ఉన్న నిర్మాత. ఆయన ఈ సినిమా కోసం ఎంతో నలిగిపోయారు. ఈ సినిమా పూర్తవుతుందా, లేదా? అని అనుకున్నప్పుడు దీనికి కీరవాణి ప్రాణం పోశారు.
ఒక్కోసారి డబ్బులు, సక్సెస్ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా ఈ మీటింగ్‌కు వచ్చాను. ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా రత్నం పేరును ప్రతిపాదించాను. నాకు సినిమా అన్నం పెట్టింది. సినిమా అంటే నాకు ప్రాణవాయువుతో సమానం’’ అని పవన్ తెలిపారు.
రేపు నా కుమారుడైనా అంతే..
‘‘మిగతా హీరోలకు బిజినెస్ అయినంతగా నా సినిమాలకు అవ్వదు. నేను ప్రజల కోసం దృష్టిపెట్టాను. బాబీదేవోల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌ను నిధి తన భుజాలపై వేసుకుంది. ఈ సినిమా అనాథ కాదు.. నేనున్నా అని చెప్పడానికే వచ్చాను. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని. దేశ సమస్యల కోసం పోరాటాలు చేసేవాడిని. నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది. నా సినిమాల సమయంలో గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని మీకూ తెలుసు. మన ప్రభుత్వం చిత్రపరిశ్రమను ఎంతో ఆదరిస్తోంది. అందుకే ఈ సినిమా ప్రచారంలో భాగం కావాలని వచ్చాను. భారతీయ సినిమాకు కుల, మత భేదాలు ఉండవు. క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. చిరంజీవి కుమారుడైనా, తమ్ముడైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలబడలేరు. రేపు నా కుమారుడైనా అంతే. ఇక్కడ ప్రతిభే ముఖ్యం’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘ఈ సినిమా కోసం తెల్లవారుజామున 2 గంటలకు లేచి కష్టపడేవాడిని. జ్యోతికృష్ణ ఎంతో సత్తా ఉన్న దర్శకుడు. ఈ సినిమా ఫలితం పూర్తిగా ప్రజల చేతిలో ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే నేను కొన్ని పనులు చేయలేను. సుస్వాగతం సినిమాలో బస్సు మీద ఎక్కి డ్యాన్స్ చేయమన్నారు. నేను చేయలేక చచ్చిపోయా. సినిమాలు చేయలేను మానేస్తాను అని మా వదిన (చిరంజీవి సతీమణి సురేఖ)కు కూడా చాలాసార్లు చెప్పాను. యాక్షన్ సీక్వెన్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ చేశా కాబట్టి అవగాహన ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని వేరు చేయడం నాకు నచ్చదు’’ అని పవన్ అన్నారు.
ఈ సినిమాలో 20 నిమిషాల ఫైట్ సన్నివేశానికి పవన్‌కల్యాణ్ కొరియోగ్రఫీ చేశారని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు. పవన్‌తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నటి నిధి అగర్వాల్ అన్నారు.