ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం ఆ మథ్యన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటీవీ ప్రసారం చేస్తున్న ‘నా ఉచ్ఛ్వాసం కవచం’ కార్యక్రమంలో త్రివిక్రమ్ పాల్గొని సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా పంచుకున్నారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో సిరివెన్నెలపై చేసిన ప్రసంగం చాలా మందికి “ప్రశంస”గా అనిపించినా… నిజానికి అది పొగడ్త కాదని, తనలో ఉన్న కోపాన్ని, బాధను వ్యక్తపరిచే ప్రయత్నమని త్రివిక్రమ్ చెప్పారు.

“పొగడ్తల్లో ఎప్పుడూ కొంత డ్రామా, కొంత అతిశయోక్తి ఉంటుంది. కానీ నేను మాట్లాడింది కేవలం నిజం. అందుకే ఆ మాటలు ఆడియెన్స్ హృదయాలను తాకాయి” అని ఆయన వివరించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి మేధావి, ఆలోచనశీలి… సినిమా పాటల కోణంలోనే బంధించబడిపోయాడన్న బాధ త్రివిక్రమ్ లో ఉండిపోయిందని చెప్పాడు. “సినిమా స్థాయిని ఆయన పెంచారు, కానీ సినిమా ఆయన స్థాయిని పెంచలేకపోయింది” అని కంటతడి పెట్టించే మాట చెప్పారు.

సామాన్యంగా తామిద్దరం కలిసినప్పుడు జీవితం, సాహిత్యం, సమాజం… ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుకునేవాళ్లమని, ఆయన మాటల్లో ఉన్న లోతు ఎప్పుడూ ఆశ్చర్యపరిచేదని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. “అయన వ్యాసాలు రాసేవారు. ‘చిలకా ఏ తోడు లేక’ లాంటి పాటలు ఆయనకు సునాయాసంగా వచ్చేవి” అని చెప్పారు.

“అవకాశాలు తక్కువైపోవడం, తెలుగు సినిమాకు ఉన్న పరిమితి వల్ల… ఆయన చేసిన దాని కంటే ఇంకా ఎన్నో చేయగలిగేవారు. అదే ఆవేదన నాకు. అదే కోపం. అదే ఆ రోజు నా ప్రసంగంలో దాగి ఉంది” అని త్రివిక్రమ్ భావోద్వేగంగా వెల్లడించారు.

“మేమిద్దరం బంధువులమే, కానీ మనసుతో చాలా దగ్గరగా ఉండే వాడిని. నేను ఆయన్ను ‘సర్’ అని పిలిచేవాడిని. ఆయన మాత్రం నన్ను ‘శ్రీను’ అని పిలిచేవాడు” అని త్రివిక్రమ్ చెప్పిన నొప్పి నిండిన జ్ఞాపకాల మాటలు… ఈ ఎపిసోడ్‌ను మరింత హృద్యంగా మార్చేశాయి.

,
You may also like
Latest Posts from