ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు నుంచి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష, సంస్కృతి గౌరవాన్ని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కమల్‌కి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది అంతా కమల్ హాసన్ గతంలో చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యతో మొదలైంది. తన సినిమా ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, “కన్నడ భాష తమిళం నుంచే జన్మించింది” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర నిరసనలకు దారితీసాయి. అనేక కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ పర్సనల్‌గా క్షమాపణ చెప్పేందుకు సిద్ధం కాకపోవడంతో, వివాదం ముదిరిపోయింది.
దీని ప్రభావంగా, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను కూడా నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా బెంగళూరు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.ఆర్. మధు, కమల్ హాసన్ ఇకపై కన్నడ భాష, భూమి, సంస్కృతి, సాహిత్యం పరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని స్పష్టంగా ఆదేశించారు. అంతేకాదు, వచ్చే నెల 30న జరగనున్న తదుపరి విచారణకు కమల్ హాసన్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు.
ఈ కేసు ప్రభావం తక్కువగా ఉండదన్నది స్పష్టం అవుతోంది. ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ మరెలాంటి వివరణ ఇస్తారో చూడాలి.