
రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార Chapter 1 కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉండటం, స్ట్రైట్ స్టార్ సినిమాలతో సమానంగా బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ టాక్. ఈ భారీ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు టికెట్ రేట్లు పెంచాలని రిక్వెస్ట్ చేశారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన స్టాండే తీసుకుంది. డబ్బింగ్ సినిమాలకు టికెట్ హైక్ అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ, అలాగే ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్ వార్ 2 సినిమాలకు కూడా టికెట్ హైక్ రిక్వెస్ట్ ను తిరస్కరించింది. ఇప్పుడు అదే పరిస్థితి కాంతార Chapter 1 కి కూడా వర్తించింది.
ఇకపోతే, ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి హైకోర్టు ఆదేశాలతో టికెట్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. దానిపై బాగా విమర్శలు రావడంతో, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏ సినిమాకైనా టికెట్ హైక్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఉంది. టికెట్ హైక్ కి ఆమోదం ఇస్తారా? లేక తెలంగాణలా కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి.
మరో ప్రక్క సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది, “డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచొద్దు” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
