ఇటీవల కాలంలో హీరోయిన్ అనుష్క షెట్టి ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న ఘాటీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో ఆ గ్యాప్ గురించి ప్రశ్నించగా, దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తగా ఆచి,తూచి స్పందించారు.
మైసూరు వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాత రాజీవ్ రెడ్డి, నటులు జగపతి బాబు, విక్రమ్ ప్రభు లతో కలిసి క్రిష్ పాల్గొన్నారు. “ఘాటీ అంటే ఈస్టర్న్ ఘాట్స్ rugged అడవులు, కొండలు మాత్రమే కాదు… అక్కడి మానవ భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం, సాహసమే కూడా. ఆ నేచురల్ రా ఎమోషన్స్‌ని స్క్రీన్ మీద పెట్టడం మా ప్రయత్నం” అని క్రిష్ వివరించారు.
అనుష్క ప్రమోషన్లలో లేకపోవడం బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు క్రిష్ స్పష్టంగా చెప్పాడు: “ప్రమోషన్లకు రావడం లేదా రాకపోవడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. మాకెలాంటి ఇబ్బంది లేదు. ‘శీలావతి’ పాత్రలో అనుష్క కెరీర్‌లోనే ఒక అత్యుత్తమమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అదే ఈ సినిమా సక్సెస్‌ని నడిపిస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు నుంచి తన తప్పుకోవడంపై వచ్చిన రూమర్స్ గురించి కూడా క్రిష్ క్లారిటీ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఎంతో గౌరవం. ఏఎం రత్నం గారి సినిమాలు చూసి నేర్చుకున్న వాడిని. వాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కరోనా సమయంలో ఏర్పడిన పరిస్థితులు, నా వ్యక్తిగత కట్టుబాట్ల వల్లనే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి, అనుష్క పబ్లిక్‌లో కనబడకపోయినా, ఘాటీ ప్రమోషన్‌ను తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్న క్రిష్, సినిమా మీద ఉన్న నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేశాడు.
చాలా కాలం గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటీ”. కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ ప్రభు మేల్ లీడ్ లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం వచ్చే ఈవారం విడుదల కాబోతుంది. ఈ నేఫధ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు.
