మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఒకవైపు షూటింగ్… మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటితోపాటు, నిర్మాణానంతర పనుల్లో మరింత నాణ్యతకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు. ఇక ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు అన్నట్లుంది ఫ్యాన్స్ పరిస్దితి.
ఇక ఇప్పుడు తాజా అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్‌తో కలిసి నర్తించబోయే హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ కావాలని ఫిక్స్ చేశారట. హిందీ చిత్రాల్లో తన గ్లామర్ షోతో అలరించిన మౌనీ, ఈ పాట కోసం స్పెషల్ లుక్‌తో మెప్పించబోతోందని టాక్.
ఈ పాటను జూలైలో ఓ భారీ సెట్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్‌కి ఇప్పటికే ట్యూన్, లిరిక్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ ఐటెం సాంగ్… సినిమాలో ఓ కీలక మలుపు సమయంలో వస్తుందట.
ఇంతవరకూ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిపోయినప్పటికీ, ఈ పాట మాత్రమే మిగిలి ఉంది. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ పనుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో, పలు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో మళ్లీ రీ-వర్క్ చేస్తున్నారు. ఇది సినిమాను వాయిదా వేసేలా చేసింది. కానీ మేకర్స్ మాత్రం క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా నాణ్యతపై నిలబడుతున్నారు.
త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్. కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న నుంచి . యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించనున్నారు.