డైరక్టర్ వెంకీ కుడుమల డైరక్ట్ చేసిన చిత్రం ఇది. కామెడీ అతని బలం. అతని గత చిత్రాలు ఛలో, బీష్మ సక్సెస్ ల వెనక కామెడీ నేరేషన్ ఉంది. ఈ సారి కూడా రాబిన్ హుడ్ తో అదే ట్రై చేసాడు. అది వర్కవుట్ అయ్యిందా. నితిన్ కి హిట్ దొరికిందా,రాబిన్ హుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకోగలిగాడా, అసలు కథేంటి వంటి విషయాలు చూద్దాం.
కథేంటి :
అనాధ అయిన రామ్ (నితిన్) తనను సాకిన ఆశ్రమానికి ఆదాయ వనరులు లేకపోవంతో సాయం చేయాలనుకుంటాడు. డబ్బున్న వాళ్లను తన తెలివితో దోచుకుంటూ రాబిన్ హుడ్‌గా మారతాడు. అయితే అతన్ని పట్టుకోవటానికి పోలీస్ ఆఫీసర్ విక్టర్(షైన్ చాం టాకో) పూర్తిగా దృష్టి పట్టడంతో రిస్క్ ఎందుకని ప్రక్కకు తప్పుకుంటాడు.
దొంగతనాలకు బై చెప్పిన రామ్ .. జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ (రాజేంద్రప్రసాద్) కు చెందిన ఇండియాస్ నంబర్‌వన్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనికి చేరతాడు. ఆ వృత్తిలో భాగంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల)కు సెక్యురిటీగా వెళ్తాడు. అయితే ఆమెను ఓ ముఠా ఫాలో అవుతుంది. ఆ తర్వాత బంధిస్తుంది.
అసలు నీరా ఎవరు? ఆమె ఇండియాలోని ఓ గ్రామానికి ఎందుకు వచ్చింది? ఆమెకు ఎదురైన సమస్యలేంటి? సామి (దేవదత్తా నాగే)కు ఆమెను ఎందుకు బంధిస్తాడు? నీరాకు రామ్ ఎలా సహకరించాడు? అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి,రాబిన్‌హుడ్ కోసం వెతుకుతున్న విక్టర్ (షైన్ టామ్ చాకో)కు దొరికాడా లేదా అన్నది కథ.
ఎనాలసిస్
ఇది కొత్త కథేమీ కాదు. ఎన్నోసార్లు తెరపై చెప్పబడిన కథేం. ఈ కథను తనకు చేతనైన కామెడీ డైలాగ్స్, సీన్స్ తో చెప్పి మెప్పించాలనుకున్నాడు దర్శకుడు. అయితే ఆ కామెడీనే రివర్స్ అయ్యింది. కథలో సరైన మలుపులు, క్యారక్టరైజేషన్స్ లేనప్పుడు కామెడీ అనుకున్న స్దాయిలో పండదు.ఫస్టాఫ్ కొంత కామెడీతో నడిచినా సెకండాఫ్ కు వచ్చేసరికి అదీ డ్రాప్ అయ్యిపోయింది.
పాత కథనే స్టైలిష్ గా చూపిస్తే కొత్త సినిమా అయ్యిపోదు కదా. అయితే ఉన్నంతలో మ్యానిపులేటర్‌గా మారిన హీరో… విలన్‌ని బ్రెయిన్ గేమ్ ఆడుకునే సన్నివేశాలు కాస్త ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి.ఈ సినిమాకు నేపధ్యంగా తీసుకున్న గంజాయి మాఫియా పెద్దగా సింక్ కాలేదనే చెప్పాలి.
అయితే సినిమాని చాలా వరకూ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ కాపాడింది. అయితే అది సరిపోలేదు. అదిదా సర్పైజ్ కిక్ ఇవ్వలేదు. ఆ సర్పైజ్ ని ట్రిమ్ చేయటంతో. శ్రీలీలకు సరైన పాత్ర ఇవ్వలేదు. ఏదో అలా వచ్చి కాస్తంత గ్లామర్ ప్రదర్సన చేసేసింది. పోనీ నితిన్ కు ఇలాంటిపాత్రలు కొత్తా అంటే చాలా సినిమాల్లో చేసేసిందే. కొత్తగా చేయటానికి పెద్దగా లేదు.
డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలు సినిమాకి ఎంతవరకూ ప్లస్ అయ్యిందనేది చూడాల్సి ఉంది. వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. కథలో డ్రామా పండి, ఎమోషన్స్ వర్కవుట్ అయితే మరో భీష్మ సినిమా అయ్యేది.
టెక్నికల్ గా
సినిమాకు జీవి ప్రకాశ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్సైంది. అయితే పాటలు వినడానికి బాగున్నాయి. చిత్రీకరణ ఆ స్దాయిలో లేవు. అలేగే ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా
అక్కడక్కడా నవ్వించే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరీ ఎక్కువ అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.