
కొన్ని వారాలుగా తమిళ సినీ వర్గాల్లో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది — సూపర్‌స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారట. తొలుత ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ దిశ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ రజినీకాంత్ తదుపరి చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట.
సుందర్ సీ రాసిన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రజినీకాంత్‌ను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ మీడియా వర్గాల ప్రకారం, కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించబోతోందట.
ఇక రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 సమ్మర్‌లో విడుదల కానుంది. మరోవైపు కమల్ హాసన్ కూడా అన్బరివ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
