సినీ, రాజకీయ, క్రీడా.. వంటి వివిధ రంగాల్లో సక్సెస్ అయిన వారి బయోపిక్స్ ని ఇటీవల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పుడు ఒకప్పటి స్టార్ క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ బయోపిక్ రెడీ చేయటానికి రంగం సిద్దం అవుతోంది. ఈ బయోపిక్ సినిమా కోసం కొంతకాలగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఇందులో నటించే హీరో ఖరారయ్యాడు. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు.. బిగ్ స్క్రీన్‌పై గంగూలీ (Sourav Ganguly)గా కన్పించనున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ స్వయంగా వెల్లడించారు.
పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ….‘‘నేను విన్నంతవరకు.. టైటిల్ రోల్‌లో రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao) నటించనున్నారు. అయితే డేట్స్ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా విడుదలయ్యేందుకు మరో ఏడాదిపైనే సమయం పట్టొచ్చు’’ అని దాదా చెప్పారు.
ఇప్పటికే క్రికెట్ నుంచి ధోని బయోపిక్ వచ్చి భారీ విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలోని పలు ఘట్టాలతో కూడా సినిమాలు వచ్చాయి.
2021 నుంచే గంగూలీ బయోపిక్ పనులు మొదలయ్యాయి. క్రికెటర్ పాత్రలో రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేర్లు వినిపించాయి. చివరకు రాజ్‌కుమార్ రావ్‌ను ఖరారు చేసారు.