టాలెంట్‌కి కేరాఫ్ ఎడ్రస్ గా ముద్ర వేసుకున్న నటి సాయిపల్లవి. తన డాన్సులతో, నేచురల్ నటనతో, చక్కటి పాత్రల ఎంపికతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. అయితే గత కొంతకాలంగా తెలుగులో ప్రాజెక్టులు తగ్గిస్తూ, బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తోంది సాయిపల్లవి.
ఇప్పటికే ఆమె చేతిలో పలు హిందీ బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో “రామాయణ” మాత్రం అతి ప్రత్యేకం. నితేష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మాగ్నమ్ ఓపస్‌లో సాయిపల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, కన్నడ రాక్ స్టార్ యష్ రావణుడిగా అలరించనున్నాడు. ఇదే చిత్రానికి ఆయన కో-ప్రొడ్యూసర్ కూడా.
ఈ భారీ మైథలాజికల్ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రణబీర్, యష్‌లకు తగినట్లు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదివరకే హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో సాయిపల్లవి కూడా ఆశ్చర్యకరమైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
తాజాగా ఆమె చేసిన తెలుగు చిత్రం “తండేల్” కు రూ.3.5 కోట్లు తీసుకున్న సాయిపల్లవికి “రామాయణ” లో రెండు భాగాలకు కలిపి రూ.12 కోట్లు రెమ్యూనరేషన్‌గా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే ఒక్కో భాగానికి రూ.6 కోట్లు—ఇది ఆమె కెరీర్‌లోనే రికార్డ్ రెమ్యునరేషన్ అని చెప్పాలి.
గ్లోబల్ ఆడియన్స్‌కి నచ్చేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ పాన్-ఇండియా ఎపిక్ ప్రాజెక్ట్‌లో సీత పాత్రకి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆమెకు ప్రీమియం రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.