ఆడవాళ్ల సీరియళ్ల పిచ్చితో ఇంట్లో మగవాళ్లు ఇబ్బంది పడుతూండటం చూస్తూంటాం. అయితే అదే సమయంలో ఆడవాళ్లకు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిపై మగవాళ్లు దృష్టి పెట్టరనే విషయం మర్చిపోతూంటాం. ఇవి రెండు బాలెన్స్ చేస్తూ సినిమా చేయాలనుకుంటే అది మంచి ఆలోచనే. అయితే సీరియల్స్ కు డిమాండ్ తగ్గిపోయి ఓటిటిలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం ఎంతవరూ సఫలికృతమవుతుందనేది ప్రక్కనపెడితే ఈ సినిమా కథేంటి, సమంత ప్రత్యేకంగా ఈ కథను తను నిర్మాతగా చేస్తున్న చిత్రానికి ఎంచుకోవటానికి కారణం ఏమన్నా ఉందా, చూద్దాం.
కథేంటి
భీమునిపట్నం లో కేబుల్ టీవీ రన్ చేస్తుంటాడు శ్రీను(హర్షిత్ రెడ్డి)కి కొత్తగా పెళ్లవుతుంది. బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో (శ్రియా) తో చాలా ఆనందంగా తన జీవితం అనుకున్న శ్రీనుకు ఫస్ట్ నైట్ రోజే ట్విస్ట్ పడుతుంది. ఆమె అసలు విషయం వదిలేసి టీవీలో వచ్చే జన్మజన్మల బంధం సీరియల్ చూస్తూ ఆత్మ ఆవహించినదానిలా వింతగా ప్రవర్తిస్తుంది.
షాకైన శ్రీను తన ప్రాణ స్నేహితుల (శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి) తో చర్చిస్తే వాళ్ల ఇంట్లోనూ ఇదే సమస్య ఎదురవుతుందని అర్దమవుతోంది. వారి భార్యల ఫరిదా, గాయత్రి కూడా రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే జన్మజన్మల బంధం సీరియల్ చూస్తున్నారని, అడ్డుపడితే వింతంగా ప్రవర్తిస్తున్నారని, చివరకు చంపడానికి కూడా వెనుకాడటం లేదనే విషయం బయటపడుతుంది. అక్కడితో అవ్వదు. ఆ ఊళ్లో చాలా మంది ఆడవాళ్లు ఇలాగే బిహేవ్ చేస్తున్నారని రివీల్ అవుతుంది.
అప్పుడు ఈ సీరియల్ పిచ్చి కి కారణం ఏమిటి. ఆడవాళ్లు ఆ ఊళ్లో ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు. ఆ సీరియల్‌కు ఆత్మలకు ఏమన్నా సంబంధం ఉందా?చివరకు ఏమిది అన్నదే ఈ మూవీ కథ.
ఎనాలసిస్
మొదటే చెప్పుకున్నట్లు ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చి ప్రధానంగా సాగే హారర్ కామెడీ మూవీగా దీన్ని ప్లాన్ చేసారు. సింపుల్ పాయింట్‌తో చివరి వరకు ఎంటర్టైన్ చేద్దామనే ట్రై చేసాడు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల. అయితే ఫస్టాఫ్ బాగానే నడిచిపోయినా సెకండాఫ్ విషయం లేక చతికిల పడింది. ఈ కామెడీ కథలో ఆత్మల ప్రవేశం ఇంట్రస్టింగ్ గానే ఉన్నా, అసలు విషయం రివీల్ అయ్యాక డ్రాప్ అవటం మొదలైంది.
అయితే రెగ్యులర్ గా టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించే స్త్రీల అణిచివేత, పురుషాధిక్యత లాంటి సున్నితమైన అంశాలను వివాదాలకు తావు లేకుండా వినోదాత్మకంగా డీల్ చేసిన విధానం బాగుంది. ఇక ఈ చిత్రం… ప్రత్యేకంగా ఒక జానర్ కు పరిమితం కాకుండా అనేక జానర్ల మిశ్రమంగా రెడీ చేసారు. కామెడీ, హారర్, సెటైర్, ఎమోషన్ — అన్నీ కలిపి వండిన వంటకం ఇది.
కథ మొదట “అల్ఫా మేల్” అనే భావనతో మొదలవుతుంది. ఆ తరవాత ఆత్మల కోణంలోకి మెల్లిగా ప్రవేశిస్తుంది. ఓ దశలో Cinema Bandi తరహా నేటివ్ టచ్ కనిపిస్తుంది. ఇంటర్వల్ తర్వాత సినిమా డల్ అవుతుంది. ముఖ్యంగా సీరియల్ రీక్రియేషన్ సన్నివేశాలు కొంచెం హాస్యాస్పదంగా మారినా, చివర్లో మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది. చివరికి ఓ గమ్మత్తైన మెసేజ్‌తో ముగుస్తుంది.
టెక్నికల్ గా
ప్యూర్ హారర్ కామెడీ కాదు. దాంతో టెక్నికల్ డిపార్టమెంట్ ఓ కామెడీ సినిమాకు పనిచేసినట్లే చేసింది. అలాగే ఓ సెటైర్ మూడ్ తేవటానికి టెక్నికల్ టీమ్ కష్టపడింది. వసంత్ మరింగంటి రాసిన కథలో మూడ్ ఉందే కానీ, మేజర్ డ్రైవ్ మాత్రం సిట్యువేషన్ల నుంచే వస్తుంది. డైలాగ్స్ కన్నా కాన్సెప్ట్ ఓనర్సిప్ ఎక్కువ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు.
అయితే సినిమాటోగ్రఫీ విషయంలో మృదుల్ సుజిత్ సేన్ ఇంకొంచెం బాగా వర్క్ చేయాల్సింది. విజువల్స్ మరింత లైవ్‌గా, కలర్ఫుల్గా ఉండాల్సింది. ఇపుడు చూస్తే పెద్ద స్క్రీన్‌పై చిన్న బడ్జెట్ షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ధర్మేంద్ర కాకర్ల తన స్టైల్‌కు తగ్గట్టు డీసెంట్‌గా డెలివర్ చేశాడు.
ఎవరెలా చేసారు.
చిత్రంలో నటులెవ్వరూ కొత్తవాళ్లైనా అప్సెట్ చేయలేదు. హర్షిత్ రెడ్డి హీరోగా న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రియ కొంతం నెగిటివ్ షేడ్స్ ని బాగా ప్రెజెంట్ చేసింది. గవిరెడ్డి శ్రీనివాస్ “అల్ఫా మేల్” స్టయిల్లో నవ్వులు పండిస్తాడు. శ్రావణి లక్ష్మి, చరణ్ పెరి, షాలినీ కొందేపూడి – అందరూ పాత్రలకు న్యాయం చేశారు. సమంత, తక్కువ సమయంలో కాస్త స్టార్ పవర్ జోడించి మూడ్‌ని మార్చేస్తుంది.
ఫైనల్ గా…
మరీ ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా , సెకండాఫ్ డ్రాగ్ ని కాస్త భరించగలిగితే బాగుందనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీలతో ఓ లుక్కేసే సినిమానే.
నటీనటులు: హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్;
సంగీతం: క్లింటన్ సిరీజో (నేపథ్యం: వివేక్ సాగర్);
సినిమాటోగ్రఫ్రీ: మృదుల్ సుజిత్ సేన్;
ఎడిటింగ్: ధర్మంద్ర కాకర్ల;
కథ: వసంత్ మరింగంటి;
నిర్మాత: ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్;
విడుదల: 09-05-2025