ఈ మధ్యన రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రీరిలీజ్ లలో చాలా వరకూ ప్రింట్ ఖర్చులు కూడా రప్పించుకోవటం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం వర్కవుట్ కావటం లేదు. అయినా సరే తగ్గేదే లే అని స్టార్ హీరోల ఫ్లాఫ్ సినిమాలను సైతం భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తారని. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ లేని, రిలీజ్ టైమ్ లో పెద్దగా వర్కవుట్ కాని సినిమా రీరిలీజ్ లో దుమ్ము దులిపి, ఇండియాలో రీరిలీజ్ లలో ట్రాప్ గ్రాసర్ గా నిలవటం అంటే మాటలు కాదు. ఆ సినిమా మరేదో కాదు సనమ్ తేరీ కసమ్.
‘సనమ్ తేరీ కసమ్’ కు రాధికారావు దర్శకురాలు. తెలుగులో నటుడుగా ప్రస్థానం మొదలుపెట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యి బాలీవుడ్ లో ప్రయత్నిస్తోన్న హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో హీరో గా చేసారు.
మౌరా హొకేన్ హీరోయిన్. ఇదో విషాద ప్రేమకథ. ఓ తెలుగు అమ్మాయి, హిందీ అబ్బాయికి మధ్య సాగే కథ. ఎమోషన్స్ తో సాగే కథ,, ఆకట్టుకునే పాటలు, మంచి నటన ఇవన్నీ కలిపి సినిమాను ఫీల్ గుడ్ అనేలా చేశాయి.
కానీ 2016 ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రానికి ఆ టైమ్ లో కేవలం 16.03 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇదే ఫిబ్రవరిలో రీసెంట్ గా 7న విడుదల చేశారు. ఈ సారి మాత్రం సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 32 .67 కోట్లు వసూలయ్యాయి. అంటే ఫస్ట్ రిలీజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్.