మొత్తానికి టామ్ చాకో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనపడుతోంది. అనుచితంగా ప్రవర్తించాడంటూ తనపై ఆరోపణలు చేసిన నటి విన్సీ సోనీ అలోషియస్ (Vincy Aloshious)కు నటుడు షైన్ టాక్‌చాకో (Shine Tom Chacko) క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదని, అయినా తన చర్యల వల్ల ఆమె ఇబ్బంది పడినందుకు సారీ చెప్పానని షైన్ తెలిపినట్టు మలయాళ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే క్షమాపణ ఎవరూ ఉత్తినే చెప్పరని, తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియా జనం, విన్సీ అభిమానులు అంటున్నారు.
కొచ్చిలో జరిగిన ‘ఇంటర్నల్ కమిటీ’ మీటింగ్‌లో.. ‘‘ఇకపై సెట్స్‌లో అందరితో మంచిగా ప్రవర్తిస్తా’’ అని షైన్ మాటిచ్చారని సదరు మీడియా పేర్కొంది. కమిటీ తీసుకునే నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని చెప్పినట్టు, ఆ డెసిషన్‌ను బట్టి ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్), ఫిల్మ్ ఛాంబర్ తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఆ సమావేశానికి విన్సీ ఒక్కరే హాజరుకాగా షైన్ కుటుంబంతో కలిసి వెళ్లారు.
అసలేం జరిగింది
ఓ సినిమా షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని విన్సీ ఆరోపించింది. ఆ ఘటనపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి చెప్పారు. ఫిర్యాదు విషయాన్ని బయటపెట్టినా నటుడి పేరును రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. కానీ, షైన్ టామ్ పేరు బయటకు వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. అతడిపై తాను ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని విన్సీ ఇటీవల అన్నారు. సినీ పరిశ్రమలో ఎదురైన సమస్యకు.. పరిశ్రమలోనే పరిష్కారం లభించాలని కోరారు.
మరోవైపు, డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో షైన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.