స్టార్స్ తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేయాలనుకోవటం ,వారసులగా తీసుకురావాలనుకోవటం తప్పేమీలేదు. ఇప్పటికే చాలా మంది చేసారు. అయితే అందరూ క్లిక్ అవ్వరు. అప్పుడు తాము కష్టపడి సంపాదించిన డబ్బుని కోల్పోవల్సి వస్తుంది.
ఆ మధ్యన ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా మారాడు. అతను నటించిన తొలి చిత్రం ‘బబుల్‌గమ్’. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేశ్వరీ మూవీస్ – పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం.. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? అంటే లేదనే చెప్పాలి. సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. కథా నేపథ్యం కూడా కొత్తదేమీ కాదు. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా కథనమంతా చాలా రొటీన్‌గా ఉంటుంది.
ఈ చిత్రానికి డబ్బులు పెట్టింది సుమ, రాజీవ్ కనకాల దంపతులే. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సుమ, రాజీవ్ ఈ చిత్రంతో చాలా డబ్బు నష్టపోయారట. కోట్లల్లో లాస్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. బబుల్ గమ్ మూవీతో మాకు మొత్తం నష్టమే. ఓటీటీ ద్వారా కొంత, శాటిలైట్ కొంత డబ్బులు వచ్చాయి తప్ప మిగిలిందంతా లాసే అని రాజీవ్ తెలిపారు. కోట్లల్లో నష్టం ఉంటుంది అని అన్నారు.
ఈ చిత్రంతో జరిగిన ఒకే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే రోషన్ నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత రోషన్ కోసం దాదాపు 70 కథలు వచ్చాయి. తన కొడుకు కోసం కథలు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని రాజీవ్ కనకాల తెలిపారు. త్వరలో ఏదో ఒక చిత్రం సెట్ కావాలని కోరుకుంటున్నట్లు రాజీవ్ తెలిపారు.
పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆది పాత్రలో రోషన్ చక్కగా ఒదిగిపోయాడు. అతని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచాడు.