ఓదెల ఊరిని, ఆ గ్రామ ప్రజలను పట్టి పీడిస్తున్న ఆత్మ పీడ విరగడ అయ్యేలా చేయడానికి నాగ సాధువులు వస్తే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది వెండితెరపై చూడాలనే విధంగా ఉంది ‘ఓదెల 2’ టీమ్ విడుదల చేసిన ట్రైలర్.
నాగ సాధువు (శివ శక్తి)గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల 2’. తెలుగులో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది.
ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ సంస్థలపై డి. మధు ప్రొడ్యూస్ చేశారు. సంపత్ నంది సూపర్ విజన్‌లో రూపొందిన చిత్రమిది. ఇవాళ ముంబైలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
‘మనం నిలబడాలంటే భూమాత… మనం బ్రతకాలంటే గోమాత… మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు… వాటి ఉచ్చ అమ్ముకున్నా బ్రతకొచ్చు’ డైలాగ్ కావచ్చు, ఆ తర్వాత యాక్షన్ సీన్స్ & ‘సవాల్ వద్దు సైతాన్’ అని వార్నింగ్ ఇచ్చే సీన్ కావచ్చు… గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అని చెప్పవచ్చు.
‘ఓదెల’ సినిమా గుర్తు ఉంటే… ఆ సినిమా చివర్లో వశిష్ట ఎన్ సింహ పోషించిన పాత్ర మరణిస్తుంది. ఆ తర్వాత అతను ఆత్మగా మారాడతాడు. ఊరిపై పగ ప్రతీకారం పెంచుకుని సాధించడం మొదలు పెడతాడు. ఆ ప్రేతాత్మ అంతు చూడటం కోసం శివ శక్తిగా తమన్నా వస్తారు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.
ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. తమన్నా మెయిన్ లీడ్ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది.