ఇంతకుముందెన్నడూ లేని విధంగా అన్ని రంగాలను ‘అమెరికా ఫస్ట్‌’ విధానంలోకి తీసుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు సినిమాలపై కన్నేసారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

భారతీయ సినిమాలపై ప్రభావం?

ఈ నిర్ణయంతో బాలీవుడ్‌, టాలీవుడ్‌ వంటి ఇండియన్‌ సినీ పరిశ్రమల ఓవర్సీస్‌ కలెక్షన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాలో అత్యధికంగా చూసే విదేశీ చిత్రాలలో భారతీయ సినిమాలు ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇప్పుడు ట్రంప్ విధించనున్న ఈ సుంకాలు అమలవుతున్నాయంటే, డిస్ట్రిబ్యూటర్లు ఇకపై విదేశీ సినిమాల పంపిణీలో వెనుకంజ వేయొచ్చు.

డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన

ప్రస్తుతం టారిఫ్‌ల అమలుపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, సినీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ టారిఫ్‌లు పూర్తిగా విదేశాల్లో నిర్మించిన సినిమాలకేనా? లేక అమెరికన్‌ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరిస్తే వాటికీ వర్తిస్తాయా? అన్న దానిపై స్పష్టత లేదు.

ఇదే తరహాలో, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విడుదలయ్యే సినిమాలకూ ఈ సుంకాలు వర్తిస్తాయా? అన్నది కూడా తెలియదు. అయినప్పటికీ, ఇప్పటికే విదేశీ చిత్రాల హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ముందస్తుగా డీల్‌ కుదుర్చుకున్న సినిమాలపై ఇప్పుడు అదనపు టారిఫ్‌లు చెల్లించాల్సి వస్తే, వారి లాభాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కొన్ని చిత్రాల విడుదలే ఆలస్యమయ్యే అవకాశమూ ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

,
You may also like
Latest Posts from