భారత చిత్ర పరిశ్రమలో “కాస్టింగ్ కౌచ్” అనే పదం కొత్త కాదు. అవకాశాల పేరుతో, పలువురు మహిళా నటీనటులు, మోడల్స్ తమపై జరిగిన అన్యాయాన్ని గళం విప్పి చెబుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా సినీ రంగంలోని దర్శకులు, నిర్మాతలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే దారుణ సంఘటనలు బయటపడినప్పుడు, అందరం ఆశ్చర్యపోతూంటాం, బాధపడుతూంటాం. తాజాగా, బాలీవుడ్ నటి నవీనా బోలే చేసిన ఆరోపణలు మరోసారి “కాస్టింగ్ కౌచ్” ముసుగులో జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తెచ్చింది.
41 ఏళ్ల నవీనా బోలే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు బయటపెట్టారు. దాదాపు 20 ఏళ్ల క్రితం, ఓ ప్రాజెక్ట్ పేరుతో దర్శకుడు సాజిద్ ఖాన్ ని కలిసినప్పుడు, తనను బట్టలు విప్పి కూర్చోమని డిమాండ్ చేశాడని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు!
“అతని మాటలు విని నేను షాక్‌కి గురయ్యాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాను,” అని నవీనా బాధతో వివరించారు.
తరువాత కూడా సాజిద్ ఖాన్ టీమ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ తాను ఎప్పటికీ స్పందించకపోయానని చెప్పిన నవీనా — “ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో మళ్ళీ అతడిని కలవకూడదని!” అంటూ ఘాటుగా చెప్పారు.
ఒకవైపు ఆమె చెప్పిన ఈ సంఘటన బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎంత లోతుగా మూలం పట్టిందో చూపిస్తుండగా, మరోవైపు దర్శకుడు సాజిద్ ఖాన్ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై నోరు విప్పలేదు.
నవీనా బోలే కెరీర్ కూడా సినిమాల కంటే మోడలింగ్, టీవీ రంగంలోనే ఎక్కువ ఉంది. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె, భరతనాట్యం నేర్చుకుని, పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా పని చేశారు.