విష్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. దాంతో, తన చిత్రానికి నష్టం కలిగే సూచనలు కనిపిస్తుండడంతో లైలా చిత్ర హీరో విష్వక్సేన్ రంగంలోకి దిగారు. ఇంతకీ పృథ్వీ ఏమి మాట్లాడారు..వైసీపీ వారికి ఎందుకు కోపం వచ్చింది, విశ్వక్సేన్ ఏం రిక్వెస్ట్ చేసారో చూద్దాం.
పృథ్వీ మాట్లాడుతూ… ఈ సినిమాలో తాను మేకల సత్యం పాత్ర పోషించానని… షాట్ గ్యాప్ లో తన వద్ద ఉన్న మేకలు లెక్కబెడితే 150 వరకు ఉన్నాయని… తాను జైలు నుంచి బయటికివచ్చినప్పుడు లెక్కబెడితే 11 మేకలే ఉన్నాయని… అదేంటో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. లైలా సినిమాలో ఇలాంటి బ్రహ్మాండమైన సీన్లు ఉన్నాయని అన్నారు.
విశ్వక్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ సినిమా ప్రచారం పాజిటివ్‌గా జరిగింది. వేరే చిత్రాల షూటింగ్స్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్‌పైనే దృష్టి పెట్టా. ఎందుకంటే ఇది నాకెంతో ప్రత్యేకం. ఇందులోని లేడీ గెటప్పు కోసం మానసికంగా ఎక్కువ కష్టపడ్డా. ఫిబ్రవరి 14న ఉదయమే ‘లైలా’ హెచ్‌డీ ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. ‘వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాయ్‌కాట్ అంటూ 25 వేల ట్వీట్లు వేశారు. నేనెందుకు బలి కావాలి సర్? 100మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనం ఎలిమినేట్ చేసేద్దామా? సినిమా వాళ్లం కదా.. తేలిగ్గా టార్గెట్ అయిపోతామా? అని అనిపిస్తోంది.
ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి అనుభవమంత ఉండదు నా వయసు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను, ప్రొడ్యూసర్.. చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయన ఏం మాట్లాడాడో ఇంటికి తిరిగి వెళ్లేంత వరకూ మాకు తెలియదు. సినిమాలో మేం అలాంటి సన్నివేశం పెట్టలేదు. ఆయన మాట్లాడిన దానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం భావ్యమా? సినిమా విడుదలకాక ముందే చంపేయకండి. అంత చులకనగా చూడకండి’’ అని విజ్ఞప్తి చేశారు.
‘ఆయన మాట్లాడే సమయంలో అక్కడ మేం ఉండి ఉంటే మైక్ లాగేసేవాళ్లం. వాళ్లకు సంస్కారం నేర్పించలేం కదా. నా సినిమా ఈవెంట్‌లో ఇది జరిగింది కాబట్టి క్షమాపణ చెబుతున్నా’’ అని విశ్వక్ అన్నారు. ‘ఇదీ ఓ రకమైన ప్రమోషనా’ అని ఓ విలేకరి ప్రస్తావించగా విశ్వక్ అసహనం వ్యక్తం చేశారు. ‘రూ. కోట్లు ఖర్చు పెట్టి మీరు సినిమా తీస్తే బాధ తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
తమ మూవీ ఫంక్షన్‌లో జరిగినందుకు తాము సారీ చెబుతున్నామని, పృథ్వీరాజ్ ఏం చెబుతారో తమకు తెలియదని నిర్మాత సాహు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించనని తెలిపారు.