వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.106కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర టీమ్ ప్రకటించింది.
అమెరికాలో కలెక్షన్స్ విషయానికి వస్తే…
‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం USA లో మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తంచేశారు.
తాను దర్శకత్వం వహించిన గత నాలుగు చిత్రాలు వరుసగా మిలియన్ డాలర్లతో పాటు, రూ.100 కోట్లు వసూలుచేశాయని, ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయిదో చిత్రమని ఆనందం వ్యక్తంచేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి అమెరికాలో లభిస్తున్న ఆదరణకు నిర్మాత దిల్‌రాజు (Dil Raju) కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
అమెరికాలో ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లు వసూళ్లు (sankranthiki vasthunnam usa release) రాబట్టింది. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, మా చిత్ర నిర్మాణ సంస్థకు బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమెరికా నుంచి అనకాపల్లి వరకూ, అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తూ మాకు సరికొత్త శక్తిని ఇచ్చిన వారందరికీ థ్యాంక్యూ’’ అని అన్నారు.
బుక్‌మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మూడు రోజుల్లో 1.5 మిలియన్ టికెట్లు విక్రయమైనట్లు బుక్‌మై షో తెలిపింది. ఒకవైపు సంక్రాంతి సెలవులు, మరోవైపు వీకెండ్ కలిసి రావడంతో థియేటర్లకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ఏపీ, తెలంగాణల్లో 220+ షోలను అదనంగా ప్రదర్శిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
అంతేకాదు, వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారు (ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం). మూడుసార్లు రూ.100 కోట్లకు పైగా వసూలుచేసిన కాంబినేషన్‌గానూ ఈ జోడీ నిలిచింది.