సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’ (Mazaka). రీతూవర్మ హీరోయిన్. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. రాజేశ్ దండా, ఉమేశ్ కె.ఆర్.బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇది సందీప్ కిషన్‌కి 30వ చిత్రం. తండ్రిగా రావు రమేశ్, కొడుకుగా సందీప్‌కిషన్… ఆ ఇద్దరి ప్రేమకథలతో సాగే సరదా చిత్రమని ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్ స్పష్టం చేస్తోంది (Mazaka). తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు.
శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో సందీప్ కిషన్, రీతూ వర్మ స్టైలిష్ అండ్ కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది.
‘ధమాకా’ తర్వాత త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో మరోసారి తన కామెడీ మార్క్ చూపించబోతున్నాడని మేకర్స్ తెలియజేశారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘నా గత చిత్రాలు ‘ఊరుపేరు భైరవకోన’, ‘రాయన్’ తర్వాత కొద్దిమంది ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు నా నుంచి కుటుంబ వినోదం ఉన్న సినిమాని కోరుకుంటున్నట్టు అర్థమైంది. అలాంటి సినిమా చేయడం బాధ్యతగా భావించా. అప్పుడే ‘మజాకా’ కథ నా దగ్గరికి వచ్చింది.
‘మేం వయసుకు వచ్చాం’ నుంచి త్రినాథరావు నక్కినతో కలిసి సినిమా చేయాలని ఉండేది. ‘మజాకా’తో కుదిరింది. దర్శకుడు త్రినాథ్, రచయిత ప్రసన్న ఎంతో నిజాయతీగా పనిచేస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి ఆస్వాదించే మంచి కథ ఇది. రావు రమేశ్ (Rao Ramesh) ఇందులో మరో హీరోలా కనిపిస్తారు. వసూళ్లతో పోస్టర్‌పై పెద్ద నంబరు కనిపించేలా చేస్తుందీ చిత్రం’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘నాకు బాగా ఇష్టమైన కథ ‘మజాకా’. ఇందులో మంచి హాస్యం, భావోద్వేగాలు ఉంటాయి. సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం చేయమన్నప్పుడు నో చెప్పలేకపోయాన’’న్నారు.