ఒకప్పుడు సినిమా హిట్ అయితే ఆడియన్స్ డబ్బులు పెట్టి రెండోసారి థియేటర్‌కి వెళ్లే రోజులు ఉండేవి. ఇప్పుడు? సినిమా విడుదలైన రోజు నుంచే క్వాలిటీ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటున్నాయ్! చాలా మంది రకరకాల కారణాలు చెప్తూ ఇంట్లో కూర్చొని ఆ పైరసీ కాపీని చూసేస్తున్నారు. సినిమాను కేవలం ఇంట్లో వేసుకోవడం చూడటం మాత్రమే కాకుండా ఏకంగా బస్సులోనే ప్రదర్శిస్తున్నారు.
ఆ మధ్యన నాగచైతన్య నటించిన తండేలు సినిమా… రిలీజ్ అయ్యే నాలుగో రోజే ఓ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు అలాంటి దొంగ ప్రదర్శన మళ్లీ జరిగింది. ఈసారి అలా బలైంది మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తుడరుమ్’ !
కేరళ మలప్పురంలోని ఓ టూరిస్ట్ బస్సులో ‘తుడరుమ్’ ప్రదర్శించారన్న వీడియోలు వైరల్ కావడంతో నిర్మాత ఎం.రంజిత్ స్పందించారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేరళ మంత్రి సాజిచెరియన్ ఈ ఘటనపై స్పందిస్తూ – నిర్ధారణ ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘తుడరుమ్’ ఏప్రిల్ 25న విడుదలై, కేవలం 10 రోజుల్లోనే ₹160 కోట్లు వసూలు చేసి మలయాళ సినీ చరిత్రలో గొప్ప రికార్డు నెలకొల్పింది. మోహన్‌లాల్ – శోభన జంట 38 ఏళ్ల తర్వాత తెరపై మెరిశారు. ఈ విజయం మధ్యలోనే పైరసీ షాక్ రావడం బాధాకరం.