
ఊహాతీతంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన కేసులో యూట్యూబ్ భారీ సెటిల్‌మెంట్ చెల్లించేందుకు అంగీకరించింది. మొత్తం $24.5 మిలియన్ (రూ.200 కోట్లకు పైగా) ట్రంప్‌కు చెల్లించనుంది.
ఏమైంది అసలు?
2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్ అల్లర్ల తర్వాత, జనవరి 12న యూట్యూబ్ ట్రంప్ ఛానెల్‌ను సస్పెండ్ చేసింది. మొదట 7 రోజులు మాత్రమే అనుకున్న సస్పెన్షన్ తరువాత అనిశ్చిత కాలం వరకు పొడిగించబడింది. దీనిని ట్రంప్ “కన్సర్వేటివ్ వాయిసెస్‌పై సెన్సార్‌షిప్” అంటూ కోర్టులో పోరాటం మొదలుపెట్టాడు.
ట్రంప్ వీడియోలు తమ విధానాలను ఉల్లంఘించాయని కంపెనీ పేర్కొంది, అయితే యూట్యూబ్ రాజకీయంగా పక్షపాతంగా ఉందని, కన్జర్వేటివ్‌ల గొంతును అణచివేయాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఇప్పుడు రాజీ కుదిరిన తర్వాత ఈ దావా ముగుస్తుంది.
ఆ డబ్బులు ఏం చేస్తారు?
ఇందులో $22 మిలియన్ (రూ.180 కోట్లకు పైగా) ట్రంప్ తరపున ట్రస్ట్ ఫర్ నేషనల్ మాల్కి వెళ్తుంది. ఈ సంస్థ వైట్ హౌస్‌లో 200 మిలియన్ డాలర్ల బాల్‌రూమ్ నిర్మాణం చేపడుతోంది.
మిగిలిన $2.5 మిలియన్‌ను అమెరికన్ కన్సర్వేటివ్ యూనియన్, రచయిత నయోమి వోల్ఫ్ వంటి ఇతర పిటిషనర్లకు పంచనున్నారు.
కీలక ట్విస్ట్
ఈ ఒప్పందంలో యూట్యూబ్ ఎటువంటి తప్పు చేశామని ఒప్పుకోలేదు. అయితే, లీగల్ ఫైట్‌లో పడితే అయ్యే ఖర్చులు, అనిశ్చితులు తప్పించుకోవడానికే ఈ సెటిల్‌మెంట్ చేసుకున్నామని కంపెనీ స్పష్టంచేసింది.
“ట్రంప్ గెలిచాడా? యూట్యూబ్ వెనక్కు తగ్గిందా?” అన్న చర్చ ఇప్పుడు అమెరికా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది!
