
ఆస్కార్ వైపు ‘హోంబౌండ్’ తొలి అడుగు… జాన్వీ కపూర్‌కు గ్లోబల్ ఛాన్స్?
భారత సినిమాలకు ఆస్కార్ కల ఇప్పుడు మరోసారి కదిలింది. జాన్వీ కపూర్ నటించిన ‘హోంబౌండ్’ చిత్రం ఆస్కార్ రేస్‌లో తొలి మెట్టెక్కింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించిన 15 సినిమాల షార్ట్ లిస్ట్‌లో ‘హోంబౌండ్’ చోటు దక్కించుకుంది. ఇది ఇంకా ఆరంభ దశ మాత్రమే అయినా, భారత ఎంట్రీకి కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఇక్కడితో ప్రయాణం ముగిసినట్టుకాదు. ఆస్కార్ దక్కాలంటే ఈ 15 సినిమాల నుంచి ఫైనల్‌గా ఐదు నామినేషన్లలోకి వెళ్లాలి. ఆ తర్వాతే అసలు పోరు మొదలవుతుంది. అంటే ‘హోంబౌండ్’ ముందు ఇంకా చాలా కీలక దశలు ఉన్నాయి. అయినా మొదటి అడ్డంకిని దాటిందన్న విషయం చిత్ర బృందానికి పెద్ద ఊరటే.
నీర్జ్ ఘయ్వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇద్దరు స్నేహితుల కథను చెబుతుంది. ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించగా, కుల వివక్ష అనే సున్నితమైన సామాజిక అంశాన్ని కథా కేంద్రంగా తీసుకున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా కనిపించనుంది.
ఒకవేళ ‘హోంబౌండ్’ ఫైనల్ నామినేషన్ దశకు చేరితే, అది కేవలం సినిమాకే కాదు జాన్వీ కపూర్ కెరీర్‌కూ పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. అప్పుడే ఆస్కార్ క్యాంపెయిన్లు, అంతర్జాతీయ ప్రమోషన్లు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. భారత సినిమా మరోసారి ప్రపంచ వేదికపై నిలబడుతుందా? జాన్వీకి ఆస్కార్ స్టేజ్ దాకా దారి తెరుచుకుంటుందా? అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఉంది.
