కొత్త తరహా కథల్లోనూ, ప్రత్యేకమైన పాత్రల్లోనూ నటిస్తూ తన ప్రత్యేక శైలితో మనందరి మనసు గెలుచుకున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తెలుగులోనూ విజయ్ సేతుపతి కి మంచి మార్కెట్ ఉంది. హిట్, ఫ్లాఫ్ తో సంభందం లేకుండా ప్రతి సినిమాతో తన నటనా వైవిధ్యాన్ని చూపిస్తూ ఆయన సినీ ప్రియులకి ఓ స్పెషల్ ఎక్సపీరియన్స్ ని ఇస్తున్నారు. గతేడాది ‘మహారాజ్’తో కెరీర్‌లో మరో మైలురాయిని సరికొత్తగా రాసుకున్న విజయ్ సేతుపతి, ఇప్పుడు ‘ఏస్’ (Ace) అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ లైన్
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఒకసారి జైల్లో ఉండివచ్చినవాడు. కొత్త జీవితం కోసం మలేసియా చేరుకుంటాడు. అక్కడ జ్ఞానానందం (యోగి బాబు) పరిచయం వలన కల్పన (దివ్య పిళ్లై) హోటల్‌లో వంటవాడిగా జాయిన్ అవుతాడు. నిరాశగా ఉన్న కాశీ జీవితంలో కొత్త ఆశలు పుట్టించేది రుక్మిణి (రుక్మిణి వసంత్)తో ఏర్పడిన రిలేషనే.
కానీ రుక్మిణి కొన్ని సమస్యలతో ఉంటుంది. వాటి నుంచి బయిటపడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. దాంతో ఆమెకు సహాయం చేయాలనుకున్న కాశీ… స్థానిక డాన్ ధర్మ (బీఎస్ అవినాష్) దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆడిన జూదంలో మొదట లక్ అతనికి ఫేవర్ చేస్తుంది. కానీ ధర్మ మోసం చేయడంతో కాశీ అప్పు రూ.2 కోట్ల వరకూ పెరిగిపోతుంది. ఇప్పుడు కాశీకి డబ్బులు చెల్లించకపోతే ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తాడు ధర్మ.
ఈ తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవటానికి కాశీ ఓ బ్యాంక్ దొంగతనం చేస్తాడు. దాంతో అతని వెనక పోలీసులు పడతారు.వారి నుంచి కాశీ ఎలా తప్పించుకుని బయటపడ్డాడు?మరో ప్రక్క ధర్మ గ్యాంగ్ తో కాశీ ఎలా పోరాడి గెలిచాడో ఇదే ‘ఏస్’ సినిమా ప్రధాన కథాంశం.
విశ్లేషణ
దర్శకుడు అరుముగ కుమార్, ప్రేక్షకులను ఒక ఎంటర్టైన్మెంట్ హైస్ట్ థ్రిల్లర్‌తో మెప్పించాలనే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ లోనే అన్ని కీలక పాత్రలను పరిచయం చేసాడు. ఈ ప్రాసెస్ లో , కథను నెమ్మదిగా నడిపారు. ఆయన నెరేషన్ పేస్ చాలా స్లోగా ఉండటంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. అయితే, విజయ్ సేతుపతి, యోగి బాబు మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ఎప్పటికప్పుడు నవ్వులు పంచుతూ ఆ స్లోనెస్ ని భరించేలా చేస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే పోకర్ ఎపిసోడ్ సహా కొన్ని సీన్స్ ఆసక్తిని పెంచుతాయి.
సెకండ్ హాఫ్‌లో కథను యాక్షన్ జానర్ వైపు మళ్లిస్తూ, కొద్దిపాటి ట్విస్టులతో ఎట్రాక్ట్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించారు. అయితే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గర మళ్లీ నెమ్మదిగా సాగుతుండటంతో కథ మరోసారి బాగా సాగతీస్తున్నట్లు అనిపిస్తుంది. చివరికి కథ ఓ ఆసక్తికర ట్విస్టుతో ముగుస్తుంది. అయితే ఆ ట్విస్ట్ మీరు ఊహించలేకపోతేనే ఆసక్తికరమైనది అని మర్చిపోకూడదు.
అరూముగ కుమార్ కథ యావరేజ్ ఉండటమే కాకుండా, కొన్ని చోట్ల అర్దం ,పర్దం లేకుండా,లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. అయినా సరే, విజయ్ సేతుపతి, యోగి బాబు పర్ఫార్మెన్సులు, హాస్య సన్నివేశాలతో ఈ లోపాలను కవర్ చేయగలిగారు.
టెక్నికల్ గా చూస్తే…
కరన్ బి. రావత్ సినిమాటోగ్రఫీ బాగుంది. మలేసియాలోని లొకేషన్లను ఆకర్షణీయంగా చూపించారు. ఎడిటింగ్ మాత్రం మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఎందుకంటే చాలా సన్నివేశాలు కథ నెమ్మదిగా సాగడానికి ఎడిటింగే కారణం. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఓ మాదిరిగా ఉన్నా, సామ్.సి.ఎస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని యాక్షన్ సన్నివేశాలకు బాగా ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో సినిమాని తప్పు పట్టడానికి లేదు. డబ్బింగ్ మాత్రం బాగానే ఉంది.
నటీనటుల్లో ..
ఇక విజయ్ సేతుపతి లాంటి నటుడిని తీసుకొని, ఆయనకు సరపడే, గుర్తుండిపోయే సీన్లు డిజైన్ చేయలేదుృ. బోల్ట్ కాశీ పాత్రపై సెంటిమెంట్ ఉంది కానీ substance లేదు. అలాగే, రుక్మిణి పాత్ర కూడా కేవలం కథ నడిపించేందుకు మాత్రమే ఉందనిపిస్తుంది. వారి బంధంలో ఎమోషన్, డెప్త్ ఉండదు. యోగి బాబు లాంటి కమెడియన్ ఉన్నా, అతడి హాస్యానికి అవసరమైన punch స్క్రీన్‌ప్లే ఇవ్వలేదు.
చూడచ్చా
అర్జెంట్ గా చూసేసే సినిమా అయితే కాదు. విజయ్ సేతుపతి వీరాభిమానులే ఉండి ఓటిటిలో వచ్చేదాకా ఆగలేమంటే చూసేయటమే.