
పవన్ కళ్యాణ్ పేరుతో ఏఐ వీడియోల దందా? ఢిల్లీ హైకోర్టులో లీగల్ కేసు!
సినిమా స్టార్స్‌కే కాదు… ఇప్పుడు రాజకీయ నాయకుడికీ “AI భయం”!. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నడుస్తున్న నకిలీ ప్రచారాలపై పెద్ద షాక్ ఇచ్చే న్యాయపోరాటం మొదలైంది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఏం జరిగింది?
వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, పేరు, రూపాన్ని వాడుతూ… ముఖ్యంగా AI ద్వారా తయారుచేసిన వీడియోలతో తప్పుడు ప్రచారం, మార్కెటింగ్ జరుగుతోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
గూగుల్, మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్)తో పాటు పలు ఈ-కామర్స్ వెబ్సైట్లలో తన పేరు, ముఖచిత్రం దుర్వినియోగం అవుతోందని పవన్ కోర్టుకు వివరించారు. ఇవి తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని స్పష్టంగా చెప్పారు.
కోర్టు స్పందన :
ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ హక్కులు ఉల్లంఘిస్తున్న URL ల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని సూచించింది. ఆ లింకులపై సోషల్ మీడియా, మధ్యవర్తి సంస్థలు వారంలోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో అజయ్ దేవగన్ కేసులో ఇచ్చిన ఆదేశాలున్నా… ఇంకా కొన్ని ప్రకటనలు ఆన్లైన్లో కొనసాగుతున్నాయని పవన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈసారి మరింత కఠినంగా వ్యవహరించాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇది ఎందుకు కీలకం?
ఇటీవల NTR, అంతకుముందు చిరంజీవి, నాగార్జున కూడా వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసు… AI వీడియోలపై సెలబ్రిటీలకు లీగల్ షీల్డ్‌గా మారుతుందా? సోషల్ మీడియా సంస్థలకు ఇది వార్నింగ్ బెల్ అవుతుందా? డిసెంబర్ 22న తదుపరి విచారణ జరగనుంది.ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఇటీవల “OG” తో హిట్ కొట్టగా… త్వరలో “ఉస్తాద్ భగత్ సింగ్” తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నెలాఖరులో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. AI యుగంలో సెలబ్రిటీ హక్కులకు ఈ కేసు గేమ్ చేంజర్ అవుతుందా?
