రీసెంట్ గా కల్కి చిత్రంలో కనిపించిన అమితాబ్ బచ్చన్ త్వరలో విజయ్ దేవరకొండ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నప్పుడు హిందీ నుంచి కొందరు స్టార్స్ ని తీసుకురావటం కామన్ గా జరుగుతోంది. అదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా ఫిల్మ్ VD14లోనూ అమితాబ్ బచ్చన్ కీ పాత్రలో తీసుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో VD12 సినిమాతో రానున్నాడు విజయ్.
విజయ్ దేవరకొండ తో ట్యాక్సీవాలా సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గతంలో VD14 సినిమాని ప్రకటించారు.
ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉండగా శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ, ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అంటూ పవర్ ఫుల్ లైన్స్ తో సినిమాపై ఆసక్తి నెలకొల్పారు.
ఇది పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అని తెలుస్తుంది. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథగా, విజయ్ దేవరకొండని ఓ యోధుడిగా చూపించబోతున్నారు అని సమాచారం. ఇన్ని రోజులు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరగ్గా తాజాగా సెట్ వర్క్ మొదలుపెట్టారు.