

నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ… ‘‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని వారు (Enforcement Directorate) భావించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇది ఎక్కడ మొదలైందనే దానిపై వారు దృష్టిపెట్టాలి. ఈ విచారణ అంశంపై మీడియాలో నాపై (Manchu Lakshmi) వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేం విచారణ ఒక విషయంలో ఎదుర్కొంటే.. మీడియా మరోదాన్ని హైలైట్ చేసింది.
ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది.. ఎక్కడికి వెళ్తోంది.. అనే విషయంపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయా.. అనే దానిపై కూడా దృష్టిపెట్టారు. నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని తెలిపారు. ఆ జాబితాలో నేనూ ఉన్నానని చెప్పారు. అందుకే నేను విచారణకు వెళ్లాను. ఇదంతా ఒక్క నిమిషం పని’’ అని మంచు లక్ష్మి అన్నారు.
అసలు ఈ యాప్‌లు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి. వీటి ఉనికి ఏంటి అనే పెద్ద సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ఆమె ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఆగస్టులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆగస్టు 13న మంచు లక్ష్మిని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నటులు ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు పెద్ద ప్రశ్న: బెట్టింగ్ యాప్స్ మూలాలు ఎక్కడ? వీటి వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ఎవరు?