
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 100% టారిఫ్ నిర్ణయం టాలీవుడ్‌కు పెద్ద సమస్యగా మారనుంది. అమెరికా మార్కెట్ తెలుగు సినిమాలకి ఎంతో కీలకం. అలాంటి సమయంలో ఈ కొత్త రూల్, ముఖ్యంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలకు, పెద్ద బ్లో ఇవ్వబోతోందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నా, రాబోయే తెలుగు సినిమాలకూ ఈ టారిఫ్ కొత్త తలనొప్పిగా మారనుంది. అమెరికా వెలుపల తీసిన ఏ సినిమా అయినా ఇప్పుడు 100% పన్ను కట్టకపోతే విడుదలకు అవకాశం ఉండదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు గందరగోళంలో పడిపోయారు.
ఇకపోతే, తెలంగాణలో రాబోయే సినిమాలకు టికెట్ ధరల పెంపుపై సందేహం నెలకొన్న పరిస్థితిలో, ఈ US టారిఫ్ షాక్ మరోసారి ఫిల్మ్ మేకర్స్‌కు తలనొప్పి పెంచింది.
అమెరికా జనాభాలో భారతీయులు సుమారు 1.6%. వారితో పాటు పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, ఇతర దక్షిణాసియన్లు కూడా భారతీయ భాషా సినిమాలను ఆస్వాదిస్తుంటారు. అంతేకాక, విభిన్నమైన కథలు, కంటెంట్ ఇష్టపడే స్థానిక అమెరికన్లు కూడా మన సినిమాలకి మద్దతుగా నిలుస్తున్నారు.
అలాంటి కీలకమైన మార్కెట్ మీద ట్రంప్ టారిఫ్ కత్తి పడడంతో, టాలీవుడ్‌కి అమెరికా బాక్సాఫీస్ కలలు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి జారుకునే అవకాశముంది.
