హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court Movie). వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని (Nani) సమర్పణలో ఇది తెరకెక్కింది. చిన్న సినిమాగా నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో ఇది దూసుకెళ్లింది.
కోర్ట్ రూమ్ డ్రామాగా ఈసినిమా రూపొందింది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఇందులో నటీనటులు ముఖ్యంగా శివాజీ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి మరో విలన్ దొరికారని నెటిజన్లు మాట్లాడుకున్నారు.
తాజాగా ఈ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ప్రాజెక్ట్ అధికారికంగా ఫైనల్ అయ్యింది. ఆసక్తికర విషయమేమిటంటే, ఈ రీమేక్‌లో ప్రముఖ నటుడు ప్రషాంత్ ప్రియదర్శి పోషించిన పాత్రలో నటించనున్నారు. మరోవైపు, తమిళ నిర్మాత కుమారుడు కృతి, ప్రముఖ నటి దేవయాని కూతురు ఇనియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అంతేగాక, ఒరిజినల్ వెర్షన్‌లో సీనియర్ అడ్వొకేట్ పాత్రలో మెప్పించిన సాయికుమార్ పాత్రను తమిళ వెర్షన్‌లో త్యాగరాజన్ పోషించనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కోర్ట్ రీమేక్ పై తమిళ పరిశ్రమలో మంచి బజ్ నెలకొంది. ఈ రీమేక్ ఎలా ఉంటుందో చూడాలి మరి!